పామాయిల్ రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో పామాయిల్ పండించిన రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి తప్పనిసరిగా అడ్డా ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇండస్ట్రీయల్ రోడ్డుపై విక్రయాలు జరుపుతున్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ పండించే రైతులకు సబ్సిడీలు కల్పించి ప్రోత్సహించడంతోనే జిల్లాలో వందలాది మంది రైతులు పామాయిల్ పండించారన్నారు. పామాయిల్ గెలలను అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, రైతులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఉపేందర్, అంజిరెడ్డి వెంకటరమణారెడ్డి, రాజు, లక్ష్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంరెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.


