ఉత్తమ ఫలితాలు
ఇష్టంతో చదివితేనే
దేవరుప్పుల: విద్యార్థులు భవిష్యత్‌లో రాణించాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో దేవరుప్పుల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధం కోసం మండల స్థాయిలో తలపెట్టిన ప్రేరణ కార్యక్రమం ఎంఈఓ జి.కళావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లా ప్రథమ స్థానం సాధించుటకు విద్యార్థులు మరింత శ్రమించి చదవాలన్నారు. పరీక్షలు అంటే భయం లేకుండా నమ్మకంగా ఉండాలని, చదువుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్నారు. గత సంవత్సరం జిల్లాలో టాప్ మార్కులతో నిలిచిన టాపర్లను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అంతకుముందు సబ్జెక్టు ఉపాధ్యాయులు రూపొందించిన ఏడు సబ్జెక్టుల ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కర్నూలుకు చెందిన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి విద్యార్థులకు చదువు, వ్యక్తిత్వము, ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏకాగ్రత, వ్యక్తిత్వ నిర్మాణం గురించి సందేశమందించారు. హైకోర్టు అడ్వకేట్ ఈటూరు శ్రీనివాసరావు బాలికల విద్య ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, అవకాశాల గురించి వివరించి, మండల విద్యా విషయాలకు తన వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. కార్యకమంలో జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ కోటాచలం, ఏఎంఓ బొమ్మనబోయిన శ్రీనివాస్, దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్దిగౌడ్, హెచ్‌ఎం విష్ణువర్దన్‌రెడ్డి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
జనగామ రూరల్: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ 2025లో భాగంగా శనివారం మినీస్టేడియం, సోషల్ వెల్ఫేర్‌లో వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారమ్, యోగా, నెట్‌బాల్, ఫుట్‌బాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకంచలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కోదండరాములు, సెక్రటరీ ఘోర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, డీఆర్‌డీఓ వసంత, ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా


