చేతికి ‘స్టేషన్’ పగ్గాలు
● పురపోరులో సత్తాచాటిన కాంగ్రెస్
● 18వార్డులకు 13 స్థానాలు
అధికార పార్టీకే
● 5 స్థానాలకే బీఆర్‌ఎస్ పరిమితం
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఘన్‌పూర్ శివారు పల్లగుట్ట క్రాస్‌రోడ్డు సమీపాన ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 18 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టారు. ఉదయం 8 గంటలకు చేపట్టిన కౌంటింగ్‌లో మొదట పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో మొత్తం 5 ఓట్లు పోల్‌కాగా రెండు ఓట్లు బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు, మూడు ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. అనంతరం బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టి కౌంటింగ్ పూర్తి చేసిన అనంతరం ఉదయం 11.30 గంటల అనంతరం అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ సమీపానికి పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాగా సందడి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి.
సత్తా చాటిన కాంగ్రెస్
నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటారు. మొత్తంగా 18 వార్డులకు గాను 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా బీఆర్‌ఎస్ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పది వార్డుల్లో తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుపొందటం విశేషం. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నాలుగు, ఛాగల్లులోని నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తలా రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఘన్‌పూర్‌లోని 1వ వార్డు బీఆర్‌ఎస్‌కు రాగా మిగిలిన 10 నుంచి 18 వరకు తొమ్మిదివార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకుంది.
చేతికి ‘స్టేషన్’ పగ్గాలు
చేతికి ‘స్టేషన్’ పగ్గాలు


