పురాధీశులు ఎవరో? | - | Sakshi
Sakshi News home page

పురాధీశులు ఎవరో?

Feb 13 2026 3:15 AM | Updated on Feb 13 2026 3:15 AM

పురాధీశులు ఎవరో?

పురాధీశులు ఎవరో?

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఓట్లు ఇలా.. ఒకే రౌండ్‌లో లెక్కింపు.. పకడ్బందీగా ఏర్పాట్లు లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఏసీ

నిఘా నీడలో..

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

జనగామ: పురపోరు ప్రజాభిప్రాయ తీర్పుతో గెలుపు ఎవరిదోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. ఈనెల 13న(శుక్రవారం) ఫలితాలు వెలువడనుండగా, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జనగామలోని హైదరాబాద్‌రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్‌పూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లో కూడా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జనగామ పురపాలికలో 44,045 మంది ఓటర్లు ఉండగా, 34,281 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్‌ శాతం 79.04గా నమోదైంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలో 18,850 ఓట్లలో 15,670 ఓట్లు పోలై 84.47 శాతం ఓటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్‌ ఏర్పాటు చేయగా ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తిచేయనున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 18 వార్డులకు 18 టేబుల్స్‌పై లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్‌లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 72 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు విధుల్లో పాల్గొననున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 20 మంది సూపర్‌వైజర్లు, 40మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు కౌంటింగ్‌ సమయంలో సేవలు అందించనున్నారు. ఆర్‌ఓలు, సిబ్బందికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం స్నాక్స్‌ మాత్రమే అందజేస్తారు. లంచ్‌ సదుపాయం లేకపోవడంతో రిలీవ్‌ సమయంలో ఇంట్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్‌ హాళ్లలో ప్రత్యేక పాసు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించ నున్నారు.

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తెలిపారు. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో గూగుల్‌ మీటింగ్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నియమావళిని అనుసరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతీ దశను స్పష్టంగా అమలు చేసే విధంగా సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రవేశం కల్పించేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు.

జనగామ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏకశిల బీఈడీ కళాశాలలో ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌ పరిశీలించారు. కౌంటింగ్‌ హాల్స్‌ నిర్వహణ, టేబుల్స్‌ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, తాగునీరు, టాయిలెట్‌ సదుపాయాలు, విద్యుత్‌ సరఫరాతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఏసీ వెంట ఆర్డీఓ గోపీరామ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

ప్రజాతీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

జనగామలో 30, ఘన్‌పూర్‌లో 18 టేబుల్స్‌

రెండుచోట్ల ఒకే రౌండ్‌

ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు

మధ్యాహ్నం 2 గంటల వరకే ఫలితాలు

భద్రత వలయంలో కౌంటింగ్‌ కేంద్రాలు

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో ఆంక్షలు అమలు చేస్తూ అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్‌ సిస్టం ద్వారా కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లు మొబైల్‌ ఫోన్లతో లోపలికి వెళ్లేందుకు అనుమతించరు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆధ్వర్యంలో మొత్తం లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. అసిస్టెంట్‌ జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ లెక్కింపును సమీక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement