ప్రయాణం..పదిలమేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం..పదిలమేనా?

Nov 5 2025 7:53 AM | Updated on Nov 5 2025 7:53 AM

ప్రయా

ప్రయాణం..పదిలమేనా?

హైవేలపై ప్రాణాలు తీస్తున్న గుంతలు

జనగామ: జిల్లాలో ప్రధాన రహదారులు ప్రమాదకర ప్రదేశాలుగా మారాయి. బచ్చన్నపేట మండల కేంద్రం, చంపక్‌హిల్స్‌ బైపాస్‌ వరకు గుంతలమయంగా మారిన రోడ్డు ప్రమాదాలకు స్వాగతం పలుకుతోంది. రాత్రివేళల్లో గుంతలు, మలుపులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రాణాంతక ప్రమాదానికి దారితీస్తోంది. మొన్న చేవెళ్ల ఘటనలో గుంతను తప్పించబోయిన టిప్పర్‌ ఆర్టీసీ బస్సుపై పల్టీకొట్టిన ఘటనలో 19 మంది చనిపోవడం రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురిచేసింది. గుంతల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, రోడ్డు ప్రమాదాలు.. రోజూ ఏదో చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. జిల్లా పరిధిలోని దేవరుప్పుల, రఘునాథపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ–పెంబర్తి హైవే మార్గం అంతా ప్రమాదకర మలుపులు, జంక్షన్‌(యూటర్న్‌) రోడ్లతో నిండిపోయింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఈ మార్గాల్లో వెళ్తున్నప్పటికీ నివారణ చర్యలు శూన్యం. సంఘటన జరిగిన తర్వాత తక్షణ చర్యలు తీసుకుంటామని ఇచ్చే హామీలు రక్తపుచారల్లో కలిసిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కు పంపేటప్పుడు, యువకులు ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు, భార్యలు భర్తల కోసం ఎదురుచూస్తూ గడపదాటే ప్రతీ క్షణం ఇప్పుడు భయంతో నిండిపోయింది. రహదారి మీద నడవాలంటే నమ్మకం లేదు. ఎప్పుడెప్పుడు ఏ గుంతలో వాహనం జారిపోతుందో తెలియని పరిస్థితి.

వరంగల్‌–హైదరాబాద్‌ ప్రధాన హైవే పెంబర్తి వైన్స్‌ వద్ద ప్రమాదకర యూ టర్న్‌

జనగామ–సిద్దిపేట ప్రధాన హైవే చంపక్‌హిల్స్‌లో బైపాస్‌ పనులు జరుగుతున్నాయి. బీటీ రోడ్డు వేయడంలో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో మట్టి, కంకరతో వచ్చిపోయే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వర్షాల సమయంలో ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయి. స్పీడ్‌గా వచ్చే వాహనాల టైర్లకు కంకర రాళుల పైకి లేస్తూ ఎవరి ప్రాణాలు ఎప్పుడు తీస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా ఎంసీహెచ్‌, హాస్పిటల్‌ వరకు అడుగడుగునా భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. వేగంగా వచ్చే వాహనాలు గుంతల వద్ద అదుపు తప్పి పడిపోతున్నాయని హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లు, సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనగామ–సూర్యాపేట జాతీయ రహదారి లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. సూర్యాపేట జాతీయ రహదారి నెల్లుట్ల బ్రిడ్జి ఎక్కే వాహనాలు యూటర్న్‌ తీసుకునే ప్రదేశంలో రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా నెల్లుట్ల నుంచి పటేల్‌గూడెం వరకు వెళ్లే దారికి ఇరువైపులా పత్తి మిల్లు ఉండడం, కుందారం క్రాస్‌ రోడ్‌ వరకు రాకపోకలు ఎక్కువగా ఉండడంతో అతివేగంతో వచ్చే వాహనా లతో ఈ ప్రదేశంలో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

జనగామ నుంచి సిద్దిపేట జిలా్ల దుద్దెడ వరకు నేషనల్‌ హైవే నిర్మాణం జరిగింది. బచ్చన్నపేటలో బైపాస్‌ వివాదం జరుగుతుండడంతో టౌన్‌లోని పెట్రోల్‌ బంకు నుంచి కొడవటూరు కమాన్‌ వరకు పాత రోడ్డును ఆలాగే వదిలేశారు. పట్టణంతో పాటు శివారు ప్రాంతంలో రోడ్డంతా ప్రమాదకరంగా మారడం, రెండు మీటర్ల వెడల్పుతో గుంతలు ఏర్పడడంతో అదుపుతప్పుతున్న వాహనాలు దుకాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌: అంబేడ్కర్‌ సెంటర్‌ హైవేపై ప్రమాదకర గుంత

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలోని జాతీయ రహదారితో పాటు సర్వీస్‌ రోడ్లు, డివిజన్‌ కేంద్రం నుంచి పాలకుర్తి, జఫర్‌గఢ్‌, ఐనవోలు తదితర ప్రాంతాలకు వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయంగా మారి ఏళ్లు గడిచి పోతోంది. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారి, శివునిపల్లి అంబేడ్కర్‌ సెంటర్‌ తాటికొండ, మీదికొండ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదు. ఈ ఒక్క ఏడాదిలోనే 20పైగా రోడ్డు ప్రమాదాలు జరుగగా, 10మంది మృత్యువాత పడ్డారు.

బచ్చన్నపేట మండల కేంద్రంలో గత నెల 25వ తేదీన కొడవటూరు కమాన్‌ సమీపంలో బోధన్‌ నుంచి కాకినాడకు వరి కోత మిషన్‌తో వెళ్తున్న లారీ గుంతలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 3వ తేదీన సిద్దిపేట నుంచి మిర్యాలగూడకు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ కమాన్‌ సమీపంలో పల్టీ కొట్టగా డ్రైవర్‌, క్లీనర్ల ఇద్దరికి గాయాలయ్యాయి. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బ్రిడ్జి సమీపంలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన రాగి సంజయ్‌ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. గుమ్మడవెల్లి రూట్‌లో ఒకరు, పటేల్‌ గూడెం చెరువు సమీపంలో బైక్‌ అదుపుతప్పి అందులో పడి మృత్యువాత పడ్డారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ హైవేపై మూడు నెలల్లో 9 నలుగురు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

దేవరుప్పుల మండలం పరిధి మన్‌పహాడ్‌ నుంచి బంజెర స్టేజీ వరకూ జనగామ–సూర్యాపేట రహదారి ఉంది. దీనిపై మెయింటనెన్స్‌ లోపాలు పెద్దగా లేకున్నా పలు స్టేజీల వద్ద వంపు ప్రాంతాల్లో వాహనాలు వేగంగా రావడంతో కూడలి ప్రాంతాలైన సీతారాంపురం(కడవెండి)బస్‌ స్టేజీ వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మన్‌పహాడ్‌–గొల్లపల్లి మధ్య వాగుపై ఉన్న భారీ వంతెనకు పడమర వైపు వాహనాలు వంతెన ఎక్కేముందు, గొల్లపల్లి చెరువు వద్ద కంటికి కనబడని కుదుపుతో వాహనాలు పక్కకు జరగడంతో అనివార్యంగా అటుగా వెళ్లే వాహనాలకు తాకే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం పలు రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు భారీ లోడుతో వెళ్లినా ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లోపమే. ఇటీవల గొల్లపల్లి వంతెన, సీతారాంపురం స్టేజీ సమీపంలో ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పలువురు మృతి చెందగా, చాలామంది క్షతగాత్రులయ్యారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు..

పలు రహదారుల నిర్వహణ అధ్వానం

ప్రమాదకరంగా గుంతలు, మూలమలుపులు

ప్రయాణం..పదిలమేనా?1
1/5

ప్రయాణం..పదిలమేనా?

ప్రయాణం..పదిలమేనా?2
2/5

ప్రయాణం..పదిలమేనా?

ప్రయాణం..పదిలమేనా?3
3/5

ప్రయాణం..పదిలమేనా?

ప్రయాణం..పదిలమేనా?4
4/5

ప్రయాణం..పదిలమేనా?

ప్రయాణం..పదిలమేనా?5
5/5

ప్రయాణం..పదిలమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement