నిరసన తెల్లారే కూలింది !
జనగామ రూరల్: మండలంలోని చీటకోడూరు రిజర్వాయర్ వాగు కల్వర్టు కొట్టుకపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చీటకోడూరు రిజర్వాయర్ నిండడంతో అధికారులు నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వరద రావడంతో వాగు వద్ద ఉన్న కల్వర్టు దెబ్బతిని పాక్షికంగా రవాణా కొనసాగింది. మంగళవారం కల్వర్టు మొత్తం కూలిపోవడంతో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి దారిని మూసివేశారు. దీంతో జనగామ నుంచి చీటకోడూరు, చౌడారం రాకపోకలు నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం బ్రిడ్జి కుంగిపోగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ఈ దుస్థితి కలిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బిడ్జి నిర్మాణం కోసం శాసనమండలిలో ప్రస్తావించినా పట్టించుకోలేదంటున్నారు. 20 రోజులుగా గానుగుపహడ్, చీటకోడూరు కల్వర్టు బ్రిడ్జిలు నిర్మించాలని కలెక్టరేట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. సోమవారం సైతం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
చీటకోడూరు కల్వర్టుతో ఏళ్ల తరబడిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, కేవలం సందర్శనలకు పరిమితం అవుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. చీటకోడూరు కల్వర్టు నుంచి దారి మూసుకపోవడంతో జనగామ నుంచి చౌడారం గ్రామం మరిగడి, రామచంద్రగూడెం నుంచి రఘునాథపల్లి మండలానికి, చౌడారం, కస్తూర్బా, మోడల్ పాఠశాలలకు వెల్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల నుంచి జనగామకు రావాలంటే నిడిగొండ మీదుగా 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. రాత్రివేళ్లల్లో బైక్‌పై అత్యవసర నిమిత్తం జనగామకు వెళ్లాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే ప్రత్యామ్నాయ మార్గం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొట్టుకపోయిన చీటకోడూరు కల్వర్టు
విద్యార్థులు, వివిధ గ్రామాల ప్రజలకు తప్పని రవాణా తిప్పలు


