నిరసన తెలిపితే అరెస్టులా?
జనగామ: గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జనగామ మండలం గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పాటు ప్రమాదకరంగా మారిన చీటకోడూరు లోలెవల్ కాజ్‌వే పనులు చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ఏంటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గ్రామాలతో పాటు ప్రధాన హైవేలకు అనుసంధానంగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణం గాలికి వదిలేయడంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోతోందన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలన్నారు. గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
పదేళ్లు దోచుకున్నారు..
● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలు అధికారం కట్టబెడితే బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కల్వకుంట్ల కుటుంబం నిలువునా దోచుకుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ డివిజన్ ఆఫీస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోపు ఇంటిగ్రేటెట్ డివిజనల్ ఆఫీస్, వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానన్నారు. కార్యక్రమంలో ఏంఎసీ చైర్‌పర్సన్ జె.లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీష్‌రెడ్డి, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, అంబటి కిషన్‌రాజ్, పోగుల సారంగపాణి, దశరథ్ నాయక్, శ్రీరాములు, అధికారులు పాల్గొన్నారు.
● ఖండించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
● వెంటనే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్


