కార్తీక వెలుగుల్లో ఆలయాలు
జనగామ: కార్తీక మాస పౌర్ణమి పండుగ కోసం జిల్లాలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఈనెల 5(బుధవారం) తెల్ల వారుజాము నుంచి శివాలయాలు, విష్ణు మందిరాలు భక్తజన సందోహంతో కళకళలాడనున్నాయి. పట్టణంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యాక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొడవటూరు సిద్దులగుట్ట, పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, చిల్పూరు శ్రీవెంకటేశ్వరస్వామి, లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామంజనేయస్వామి, పట్టణంలోని శ్రీరామలింగేశ్వర, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశ్వర, శ్రీ కన్యకాపరమేశ్వరి, గీతాశ్రమం, చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వర తదితర ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
జీడికల్ రాములవారి బ్రహ్మోత్సవాలు షురూ
లింగాలఘణపురం: జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లా వాసులకు ఇంటి ఇలవేల్పుగా కొలిచే జీడికల్ రాములవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు విజయ సారథి రాఘవాచార్యులు, విచ్చేయ శర్మ, భార్గవాచార్యులు, మురళీధరాచార్యుల బృందంచే వేదమంత్రోత్సవం, లక్ష్మీపూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ తదితరులు పాల్గొన్నారు.
జానపద నృత్యోత్సవంలో ఒగ్గుడోలు ప్రదర్శన
లింగాలఘణపురం: జాతీయ జానపద నృత్యోత్సవం, పంచకళా ఉత్సవం–2025లో భాగంగా ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు అసోంలోని గువాహాటీ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఒగ్గుడోలు ప్రదర్శన ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, పంచసుర్ రిపర్టరీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి కళా ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ నుంచి ఒగ్గుడోలు ప్రదర్శనకు చంఢీశ్వర ఒగ్గుకళ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఒగ్గు రవికి ఆహ్వానం అందింది.
‘ఉపాధి పనుల్లో అక్రమాలకు తావివ్వొద్దు’
కొడకండ్ల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు తావివ్వొద్దని ఏపీడీ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఏపీడీ మాట్లాడుతూ ఉపాధి పనుల్లో అక్రమాలను సహించబోమన్నారు.
కార్తీక వెలుగుల్లో ఆలయాలు
కార్తీక వెలుగుల్లో ఆలయాలు


