రఘునాథపల్లి: ఉపాధి పనుల్లో కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కొలతల ప్రకారం పనులు చేసి గిట్టుబాటు కూలి పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారులో ఈజీఎస్ పథకంలో భాగంగా చేపట్టిన ఆర్సీబీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. జాబ్‌కార్డులు, మస్టర్ రోల్, రిజిస్టర్లను ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు? వారి పనివేళలు ఎప్పటి వరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారని ఆరా తీశారు. 143 మంది కూలీలు పనులకు వచ్చారని, ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పని చేస్తున్నారని, ప్రతీ కూలీ రోజు మీటరు లోతుగా రెండు మీటర్ల వెడల్పుతో పనులు చేస్తున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కూలీలు ఓఆర్‌ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని కలెక్టర్ సూచించారు. అధికారులు పనులను పరిశీలిస్తూ కొలతల పుస్తకం, జాబ్‌కార్డులు, మస్టర్ రోల్‌ను పర్యవేక్షించి, అన్ని రిజిస్టర్లను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కూలీలకు కలెక్టర్ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఆయన వెంట డీఆర్డీఓ వసంత, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి త్రివేణి, టెక్నికల్ అసిస్టెంట్ విజయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ కుంట రవి, కూలీలు ఉన్నారు.
రాయితీ సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అందిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం జనగామ పురపాలిక పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్‌ల క్రమబద్ధీకరణ ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ఆన్‌లైన్ విధానం పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరు వందశాతం ఫీజు చెల్లించి, ప్లాట్ల ను క్రమబద్ధీకరించు కోవాలన్నారు. అనంతరం 3వ వార్డులో ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ కింద ప్లాట్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుడికి ప్రొసిడింగ్ కాపీని అందించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా