జనగామ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగు పరిచేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్యూఏఎస్) అమలు చేస్తోంది. మెటర్నిటీ, జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల పరిధిలో నాణ్యమైన సేవలకు గాను ‘ఎన్‌క్వాస్’ అర్హత సర్టిఫికెట్ జారీ చేస్తారు. అర్హత సాధించిన తర్వాత మూడేళ్ల పాటు ఆస్పత్రులకు కేటగిరీల వారీగా కేంద్రం నిధులు ఇస్తుంది. 2024–25, 26, 27 సంవత్సరాలకు గాను మొదటి విడతలో జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను ఎంపిక చేశారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు సబ్‌సెంటర్ సేవలకు సంబంధించి ఎన్‌క్వాస్ బృందం ఆన్‌లైన్‌లో వివరాలను సేకరించింది.
4 పీహెచ్‌సీలు.. 8 సబ్‌సెంటర్ల ఎంపిక
జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్లు, 62 పల్లె దవాఖానలు, ఒక బస్తీ దవాఖాన, 4 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, ఒక ఎంసీహెచ్ ఉన్నాయి. కాగా పీహెచ్‌సీల పరిధిలో 20 స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కోసం జిల్లాలోని 4 పీహెచ్‌సీలు, 8 సబ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పగూడెం, తాటికొండ, ఓబుల్‌కేశ్వాపూర్, కొడకండ్ల పీహెచ్‌సీలు, చిన్నమడూరు, ఆలీంపూర్, గూడూరు, సిద్ధెంకి, వడ్లకొండ, కుందారం, కోమటిగూడెం, ఉప్పుగళ్లు సబ్ సెంటర్లు ఉన్నాయి.
నిర్వహణ అంశాలు
ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణ, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు, రోగి సంరక్షణ, ఆస్పత్రి నిర్వహణ, ఇన్ఫెక్షన్స్ నియంత్రణ, మార్గదర్శకాలను పాటించడం, అత్యవసర సేవలు, ఖచ్చితమైన రోగ నిర్థారణ, శస్త్ర చికిత్స విధానంలో భద్రత, నైపుణ్యం, సమర్థవంతంగా ఫార్మసీ నిర్వహణ, పరిశుభ్రమైన శానిటేషన్, సపోర్ట్ సర్వీసెస్, క్లినికల్ కేర్, ఓపీ సేవలు, వైద్య పరికరాల నిర్వహణ తదితరాలకు సంబంధించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
అర్హత అనంతరం నిధులు ఇలా..
ఎన్‌క్వాస్‌కు అర్హత సాధించిన సబ్ సెంటర్లకు మూడేళ్ల పాటు ఏడాదికి రూ.50 వేల చొప్పున కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. గత ఏడాది ఉప్పుగల్, మల్కపూర్, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, దేవరుప్పుల పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్‌కు ఎంపిక కాగా.. ఏడాదికి ఒకసారి నిధులు వస్తున్నాయి.
ఆరోగ్య సంరక్షణ.. వైద్యసేవల పరిశీలన
నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
అర్హత సాధిస్తే మూడేళ్ల పాటు నిధులు
4 పీహెచ్‌సీలు.. 8 సబ్‌సెంటర్ల ఎంపిక
‘ఎన్‌క్వాస్’ పరిశీలించే కేటగిరీలు
ఆస్పత్రిలో తగిన మౌలిక సదుపాయాలు, శుభ్రమైన వాతావరణం, అవసరమైన వైద్య పరికరాల నిర్థారణ
అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు రోగి సంరక్షణ, వైద్య సేవల నాణ్యత, పర్యవేక్షణ
ఆస్పత్రిలో సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి ప్రొటోకాల్ అమలు
ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి క్రమంతప్పకుండా శిక్షణ, మూల్యాంకనం
రోగి రికార్డుల నిర్వహణ
పేషెంట్ల పట్ల గౌరవ మర్యాదలు
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరిశీలన..
జిల్లాలో ఎన్‌క్వాస్ కోసం 4 పీహెచ్‌సీలు, 8 సబ్ సెంటర్లు ఎంపిక చేశాం. మొదటి విడతలో దేవరుప్పుల మండలం చిన్నమడూరు సబ్‌సెంటర్‌లో రోగులకు అందజేస్తున్న సేవలను ఎన్‌క్వాస్ బృందం ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుంది. గుర్తించిన సబ్ సెంటర్లను విడతల వారీగా ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తారు. పీహెచ్‌సీలను మాత్రం నేరుగా సందర్శిస్తున్నారు.
– మల్లికార్జున్‌రావు, జిల్లా వైద్యాధికారి
ఆస్పత్రుల్లో ఎన్‌క్వాస్
ఆస్పత్రుల్లో ఎన్‌క్వాస్