జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా సరిత | - | Sakshi
Sakshi News home page

జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా సరిత

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

జగిత్యాలజోన్‌: జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శిగా ఎం.సరితను నియమిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ఆమె సోమవారం జిల్లాకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లా జడ్జి సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి సరిత మాట్లాడుతూ.. జిల్లాలో న్యాయసేవా సంస్థ కార్యకాలపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ న్యాయవాదులు కటుకం చంద్రమోహన్‌, విజయ్‌కృష్ణ, రమాదేవి పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఓల్డ్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు న్యాయ విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశలోనే అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

జగిత్యాలటౌన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలన్నారు. ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా ధరూర్‌ క్యాంప్‌లోని శ్రీకోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గౌరిశెట్టి హరీశ్‌ శాలువాతో సత్కరించారు.

రోడ్లపై గుంతలు పూడ్చాలి

మెట్‌పల్లి: వార్డుల్లో మట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ మైలారపు లింబాద్రి అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం జరిగింది. వర్షాలతో పలుచోట్ల మట్టి రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని, వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చైర్మన్‌ మాట్లాడుతూ కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మొత్తం 13అంశాలను అమోదించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ ఓంకారి నవీన్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, డీఈ నాగేశ్వర్‌రావు తదితరులున్నారు.

ఘనంగా సంకటహర చతుర్థి

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి సోమవారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్‌ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం చేపట్టారు.

సెలవులో ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: ఎస్పీ అశోక్‌కుమార్‌ వారం రోజులు సెలవుపై వెళ్లారు. శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లిన ఆయన డీజీపీతో జరిగిన సమావేశంలో రెండురోజుల పాటు పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో వచ్చే ఆదివారం వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఇన్‌చార్జి ఎస్పీగా సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బీ గితేకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement