బియ్యం అప్పగించకుంటే కేసులు
● పెగడపల్లి మండలం బతికెపల్లిలో హరిహర మోడ్రన్ రైస్‌మిల్లు యజమానులు ప్రభుత్వం వద్ద రూ.3 కోట్ల ధాన్యాన్ని తీసుకుని బియ్యం అప్పగించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిపై పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
● జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం శివారులోని మంజునాథ రైస్‌మిల్లు ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల విలువైన ధాన్యాన్ని తీసుకుని బియ్యం అప్పగించకపోవడంతో మిల్లు యజమానులు ఐదుగురిపై జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జగిత్యాలరూరల్: రైతుల నుంచి ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ కొంతమంది మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతరులకు విక్రయించుకుని సొమ్ము చేసుకుని ఎగవేతకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు వారిపై ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. అయినప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బియ్యం అప్పగించకుండా, డబ్బు చెల్లించకుండా అధికారులు నోటీసులు జారీ చేస్తే కోర్టులను ఆశ్రయించి కాలం వెళ్లదీస్తున్నారు.
జగిత్యాలలో 19 మంది డిఫాల్టర్లు
జగిత్యాల జిల్లాలో 2023–24, 2024–25 సంవత్సరాలకుగాను 19 మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని ఇప్పటివరకు బియ్యం అప్పగించలేదు. ధాన్యం విలువ సుమారు రూ.80కోట్లు ఉంటుందని సమాచారం. మిల్లర్ల వద్ద ధాన్యం కూడా లేకపోవడంతో అధికారులు వారిని డిఫాల్టర్లుగా ప్రకటించారు. ఆగస్టు 15 లోపు వీరు బియ్యం అప్పగించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మిల్లర్ల వద్ద ధాన్యం కరువు
చాలామంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది మిల్లర్లు ఎంతో కొంత బియ్యం అప్పగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు మిల్లర్ల వద్ద ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం.
ధాన్యం తీసుకున్న 19 మంది రైస్‌మిల్లర్లు రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఆగస్టు 15 వరకు బియ్యం అప్పగించకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడతాం. వానాకాలం సీజన్ ధాన్యాన్ని కేటాయించబోం.
– జితేంద్రప్రసాద్,
జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్
రూ.21 కోట్ల ఎగవేత
19 మంది రైస్‌మిల్లర్లు డిఫాల్ట్
ఇద్దరు రైస్‌మిల్లర్లపై క్రిమినల్ కేసులు
అప్పగించాల్సిన బియ్యం విలువ రూ.80కోట్లు


