జగిత్యాల:జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు వెలుస్తున్నాయి. ఎందులోనూ నిబంధనలు పాటించకున్నా.. వైద్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే విశాలమైన స్థలం, ఇతర వసతులు ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ ఆస్పత్రి చుట్టూ తిరిగేలా ఉండాలి. కానీ.. ఎక్కడ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకై న గదుల్లోనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. చిన్నచిన్న గదుల్లో ఆస్పత్రులు నిర్వహిస్తూ అందినంత ఫీజులు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 170 వరకు ఆస్పత్రులుంటాయి.
నిబంధనలు తూచ్
జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. నర్సింగ్‌హోంలు, ఐసీయూలు ఉంటే సరిపడా బెడ్స్ ఉండాలి. నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే మంటలు ఆర్పేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఉండాలి. ఆస్పత్రి భవనంపై నిర్ణీత సామర్థ్యం గల నీటి ట్యాంకులు, వార్డులు, గదులకు ఉండాలి. ఇవి ఎక్కడా మచ్చుకై నా కన్పించడం లేదు. అంతస్తుల కొద్ది ఆస్పత్రులున్నాయే కానీ ఎక్కడా వాహనాలు తిరిగే చోటు లేదు. అలాగే మెట్లు విశాలంగా.. ర్యాంపులు ఉండాలి. రోగులను స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు వీలుగా ఉండాలి. ఇవేమీ పట్టించుకోకుండా చిన్నచిన్న ఇరుకై న గదులను అద్దెకు తీసుకుని ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు.
కన్పించని బోర్డులు
ప్రతి ఆస్పత్రిలో వైద్యుల వివరాలు, వారి అర్హతలు, ఇతర సిబ్బంది వివరాలు, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, ఫీజుల వివరాలు ఉండాలి. కానీ కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా వేతన చట్టం ప్రకారం కనీస వేతనాలు సైతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కార్మిక శాఖ నుంచి అనుమతి సైతం తీసుకోవాలి.
రోడ్లపైనే జనరేటర్లు
జనరేటర్లకు సపరేట్ గదులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. రోడ్లపైనే ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రుల ముందున్న ఖాళీ స్థలంలో పెద్దపెద్ద జనరేటర్లు పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఆటోమెటిక్ జనరేటర్లను రోడ్లపై రాకుండా ప్రజలకు కాకుండా ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసుకోవాలి.
తరుచూ డాక్టర్లు మారితే
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత డాక్టర్ ఎవరు..? ఏ ఆస్పత్రి..? నర్సింగ్ హోమా..? లేదా జనరల్ ఆస్పత్రా..? మల్టీకేరా..? వైద్య శాఖకు తెలపాల్సి ఉంటుంది. కొందరు న్యూరోసర్జన్ అని, మరోసారి ఫిజిషియన్ అంటూ బోర్డులు మార్చుతున్నారు. ఏదైనా ఆస్పత్రిలో డాక్టర్ మారారంటే వెంటనే వైద్యశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. అయినా ఎవరూ అనుమతులు తీసుకోవడం లేదు.
రోడ్లపైనే పార్కింగ్.. సెల్లార్లలో వ్యాపారం
జగిత్యాలలో ఏ ఆస్పత్రిలోనూ పార్కింగ్ సౌకర్యం లేదు. సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ అందులో మెడికల్‌షాపులుగానీ, ఇతరత్రా వేరే షాపులు నిర్వహించుకుంటున్నారు. అశోక్‌నగర్, జంబిగద్దె, గొల్లపల్లి రోడ్‌లో ఎక్కువగా ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు పేషెంట్లను తీసుకొస్తే రోడ్లను బ్లాక్ చేయాల్సిన పరిస్థితి.
ఫీజులూ అధికమే..
ఆస్పత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించరుగానీ వేలల్లో ఫీజులు లాగుతుంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎంపీలతో వైద్యులు కుమ్మకై ్క కమీషన్ల పేరిట వారిని ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తూ వేలల్లో బిల్లులు లాగుతుంటారు. ఆస్పత్రుల్లో మాత్రం వసతులపై నిర్లక్ష్యంగా ఉంటారు.
సెల్లార్లలోనే మెడికల్ షాపుల నిర్వహణ
ఇరుకు గదుల్లోనే రోగులకు చికిత్స
మచ్చుకై నా కనిపించని ఫైర్ సేఫ్టీ
ప్రజల భద్రత అంతంతే
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తిని పరామర్శించేందుకు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పై అంతస్తులోకి లిఫ్ట్‌లో వెళ్తుండగా అకస్మాత్తుగా వైరు తెగి ఊడిపోయింది. ఫస్ట్‌ఫ్లోర్ కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆస్పత్రుల్లో రోగులకు తగిన వసతులు లేవు. ఇలాంటి పరిస్థితులు ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. మన జిల్లాలోనూ అధికంగా ఉన్నాయి.
ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో గల ప్రైవేటు ఆస్పత్రులు. ఇందులో ఏ ఆస్పత్రిలోనూ ఫైర్‌సేఫ్టీ మచ్చుకై నా కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ తిరిగేలా ఏ బిల్డింగ్‌లోనూ లేదు. వైద్యశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే రోడ్డులో అనేక ఆస్పత్రులున్నాయి. వైద్యశాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.


