కారు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బండలింగాపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం మోహన్‌(27) కథలాపూర్‌లో ఓ వివాహానికి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో విట్టంపేట వైపు నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. కారు డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. మృతుడి తండ్రి జనార్ధన్‌ ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ శైలేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

వరదకాలువలో దూకి వివాహిత ఆత్మహత్య

మెట్‌పల్లిరూరల్‌: వరదకాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌ తెలిపారు. మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన గుండెల లక్ష్మీ(59)కి ఆమె భర్త రాజన్నకు కుటుంబంలో వివాదం తలెత్తింది. మనస్తాపం చెందిన లక్ష్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెదికినా ఆచూకీ దొరకలేదు. గురువారం వేకువజామున రాజేశ్వర్‌రావుపేట శివారులో వరదకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ చెల్లె అసరీ గౌరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వెల్గటూర్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం చెర్లపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎరవెల్లి పర్శరాం (43) వ్యక్తిగత పని నిమిత్తం ఎండపల్లి మండలానికి వచ్చాడు. కారును రోడ్డు పక్కన పార్క్‌ చేసి రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పర్శరామ్‌కు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఆయన భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. పర్శరాం తల్లి లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

అంజన్న జయంతి ఆదాయం రూ.1.74కోట్లు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 12వరకు నిర్వహించిన పెద్ద జయంతి ఉత్సవాలకు రూ.1.74కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.99,79,525, పులిహోర రూ.15,41,380, దీక్ష విరమణ రూ.32,66,600, కేశఖండనం రూ.8,37,200, శీఘ్ర దర్శనం ద్వారా రూ.17, 94,200 వచ్చిందన్నారు. గతేడాదితో పోల్చితే రూ.24లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని అధికారులు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు ఈవో కృతజ్ఞతలు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement