ధర్మపురి: అతి వేగం, అజాగ్రత్తతో కారును నడిపి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు. ఎండపెల్లి మండలం కొత్తపేటకు చెందిన కోడి ప్రవీణ్, గోపాల మొగిలి, గోపాల రాజయ్య, తరాల రాజమల్లు గురువారం అదే గ్రామానికి చెందిన తరాల ప్రవీణ్‌తో కలిసి కారులో హాజీపూర్ వెళ్లి వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో రాయపట్నం జాతీయ రహదారి మూలమలుపు వద్ద అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న స్కూటి, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ముందు సీటులో కూర్చున్న తరాల రాయమల్లు (53) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. కోడి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు..
పెగడపల్లి: మండలంలోని మద్దులపల్లికి చెందిన గన్నెబోయన చంద్రయ్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మామిడితోటలు కౌలుకు తీసుకుని చంద్రయ్య జీవనం సాగిస్తున్నాడు. బోయినిపల్లి మండలం అనంతపల్లెలో కౌలుకు తీసుకున్న ఓ రైతు తోటలో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహమైంది.
మంటలు అంటుకుని వృద్ధురాలు..
మేడిపల్లి: టీ చేసుకుందామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు చీర కొంగుకు మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవ దహనమైన ఘటన భీమారం మండలం దేశాయిపేటలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎగూర్ల లక్ష్మీదేవి (82) గురువారం ఉదయం చాయ్ తాగుదామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చీర కొంగుకు అంటుకొని తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. లక్ష్మీదేవి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె తెలిపారు.


