అమ్మాయిలు.. నాంచాక్‌ | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు.. నాంచాక్‌

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్‌ ● కర్ర, నాంచాక్‌లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తి

● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్‌ ● కర్ర, నాంచాక్‌లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తి

వేములవాడ: అమ్మాయిలే కదా.. అని అనుకోవద్దంటున్నారు ఈ చిచ్చరపిడుగులు. వారు కర్రసాము చేస్తే ఎదురుగా ఎవరూ ఉన్న బేజార్‌ కావాల్సిందే. వారు నాంచాక్‌ పడితే ఎంతటి వారైనా జీ హుజూర్‌ అనాల్సిందే. ఇదంతా వేములవాడ మున్సిపల్‌ పార్క్‌లో నిత్యం ఉదయం కనిపించే బాలికల గురించే. వారు కొన్నాళ్లుగా కోచ్‌ ఎంఏ మన్నాన్‌ సమక్షంలో కర్ర, నాంచక్‌ వంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణకు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బాలికలు ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు.

నాంచాక్‌ నైపుణ్యానికి మరో పేరు

కరాటే విద్యలో భాగంగా వినియోగించే శస్త్రాయుధాలలో నాంచాక్‌కు ప్రత్యేక స్థానం. రెండు చిన్న ఐరన్‌ పైపులకు మధ్యలో గొలుసుతో కలిపి ఉంటుంది. చూసేందుకు సాధారణంగా కనిపించినా నిపుణుల చేతిలో పడితే శత్రువులకు భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. దాడిచేయడం, ఆత్మరక్షణకు నాంచాక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాంచాక్‌ను సాధనతో శరీర నియంత్రణ, వేగం, సమతుల్యత పెరుగుతాయి. ఇది కేవలం దెబ్బ కొట్టే ఆయుధమే కాదు, ఒక నృత్యకళా రూపంగా కూడా చెప్పుకుంటారు. పోటీలు, ప్రదర్శనలు, ఆత్మరక్షణలో తమకు కొత్త శక్తిని అందిపుచ్చుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement