గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ జెడ్పీహెచ్‌ఎస్
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం జెడ్పీహెచ్‌ఎస్
మల్లాపూర్ మండలం సాతారం జెడ్పీహెచ్‌ఎస్
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ నియోజవకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు ఎంపికయ్యాయి. మంచి విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉండి, భవనాలు, మెరుగైన ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లను ఎంపిక చేశారు.
విద్యార్థులకు మంచి అవకాశం
ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ జెడ్పీహెచ్‌ఎస్, జగిత్యాల నియోజకవర్గం జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం సాతారం జెడ్పీహెచ్ పాఠశాలలు ఎంపికయ్యాయి. కార్పొరేట్ స్థాయిలో భవనాల నిర్మాణం, విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉండటంతోపాటు, ఎల్‌కేజీ, యూకేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ తరగతులు ఉంటాయి. అత్యాధునిక పద్ధతిలో సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉంటాయి.
రూ.38 కోట్ల అంచనాలతో..
ఒక టీపీఎస్‌కు దాదాపు రూ.38 కోట్ల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 40 వేల లీటర్ల సామర్థ్యం గల సంప్, డైనింగ్‌హాల్, మూడు అంతస్తులతో స్కూల్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, ఫర్నిచర్, ల్యాబ్, ఇండోర్ స్పోర్ట్స్, ప్రోవైడింగ్ అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ తదితర నిర్మాణాలు చేపడతారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆధునిక సౌకర్యాలు
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో విద్య ఉంటుంది. ఆధునిక సౌకర్యాలు, అన్ని వసతులు ఉంటాయి. ఇంటర్ వరకు బోధిస్తారు.
– రాము, డీఈవో
ఎంపికై న స్కూళ్లు ఇవే..


