పనులు పూర్తయినా అందని నీరు | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తయినా అందని నీరు

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

● అమృత్‌ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం మెట్‌పల్లి మున్సిపాలిటీకి మూడేళ్ల క్రితం రూ.19.40కోట్లు కేటాయించింది. ● ఆ నిధులతో అర్బన్‌ హౌజింగ్‌కాలనీ, విలీన గ్రామాలైన ఆరపేట, వెంకట్రావ్‌పేటలో తాగునీటి పనులు చేపడుతున్నారు. ● వీటిలో 39కిలోమీటర్ల పైపులైన్‌ ఏర్పాటు, ఇళ్లకు నల్లా కనెక్షన్లు, ఆరపేటలో ప్రత్యేకంగా వాటర్‌ ట్యాంక్‌ వంటి పనులు ఉన్నాయి. ● ఇందులో ఇప్పటివరకు సుమారు 32 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేయగా.. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు కేవలం 20శాతం మాత్రమే పూర్తయ్యాయి. ● అర్బన్‌ హౌజింగ్‌ కాలనీ, వెంకట్రావ్‌పేటల్లో అమృత్‌ పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. అయినా అర్బన్‌ హౌజింగ్‌ కాలనీలో ఇంకా భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. ● ఈ కాలనీలో నీటి సమస్య అధికంగా ఉంది. వేసవి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ● అధికారులు స్పందించి భగీరథ నీటిని అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటిని అందించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మిషన్‌ భగీరథ పథకం కింద ప్రత్యేకంగా వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లు, ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఈ పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని కాలనీలకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయడం లేదు. అప్పటి ప్రభుత్వం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు వెచ్చించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో ప్రయోజనం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా అమృత్‌ 2.0 పథకం కింద నిధులను మంజూరు చేసింది. భగీరథ పథకం కింద చేయలేకపోయిన ప్రాంతాల్లో ఈ నిధులతో పనులను శ్రీకారం చుట్టారు.

మెట్‌పల్లికి రూ.19.40కోట్లు కేటాయింపు

ఆ రెండు చోట్ల పూర్తి..

ఈ చిత్రం మెట్‌పల్లిలోని అర్బన్‌ హౌజింగ్‌ కాలనీలో ఉన్న వాటర్‌ట్యాంక్‌. కాలనీ ప్రజలకు భగీరథ నీరు అందించేందుకు నిర్మించారు. వీధుల్లో అంతర్గత పైపులైన్లతోపాటు ఇళ్లకు నల్లా కనెక్షన్ల వంటి పనులు పూర్తయ్యాయి. నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు ఇంకా ఆ కాలనీకి భగీరథ నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం వేసవిలో అక్కడి ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా మున్సిపల్‌ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారే తప్ప..భగీరథ నీళ్లను మాత్రం అందించే చర్యలు తీసుకోవడం లేదు.

తొందరలోనే సరఫరా చేస్తాం

అమృత్‌ పథకం కింద చేపట్టిన పనులు కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నీటని సరఫరా చేస్తున్నాం. అర్బన్‌ హౌజింగ్‌ కాలనీలో కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అక్కడ కూడా తొందరలోనే నల్లాల ద్వారా ప్రతి ఇంటికి భగీరథ నీటిని సరఫరా చేస్తాం.

– నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ డీఈఈ

‘భగీరథ’ నీటి సరఫరాలో అధికారుల జాప్యం ఇబ్బంది పడుతున్న మెట్‌పల్లి పట్టణ ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement