కొడిమ్యాల: జేఎన్టీయూలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – ఎడ్యుకేషన్ వీక్‌లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ జి.నర్సింహ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పిల్లలకు నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రతి వర్గానికి విద్య అందుబాటులో ఉండాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ విద్యార్థులకు పలు విషయాలపై వివరించారు. కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
తెమడ పరీక్ష చేయించుకోవాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్
మల్యాల: క్షయవ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించేందుకు తెమడ పరీక్ష చేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. టీబీ అభియాన్‌లో భాగంగా మండలంలోని మ్యాడంపల్లి ఇట్టుకబట్టీల్లో బుదవారం టీబీ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా జ్వరం, బరువు తగ్గడం, సాయంత్రంవేళ చెమటలు పట్టడం, ఆకలి మందగించటం టీబీ లక్షణాలు అని, తక్షణమే తెమడ పరీక్ష చేయించుకుని, మందులు వాడితే వ్యాధిని నివారించవచ్చని అన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు పోషకాహారం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి అందిస్తోందని తెలిపారు.
సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు
జగిత్యాలక్రైం: బక్రీద్ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఆవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువైద్యుల ధ్రువీకరణ పత్రాలు లేకుండా జంతువులను రవాణా చేస్తే వాహనాలను జప్తు చేసి.. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరి స్థితుల్లోనూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడకూడదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గోవధ నివారణ, అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
రైస్‌మిల్లుల పరిశీలన
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశించారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఎస్సైలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ప్యాక్స్ సీఈవోలు, పోలీసు అధికారులు సంయుక్తంగా కేంద్రాలు, రైస్‌మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ధాన్యం సేకరణ, అన్‌లోడింగ్ ప్రక్రియ, రవాణా వాహనాల కదలిక, ధాన్యం నిలువ విధానం, మిల్లులకు తరలింపు అంశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు సజావుగా జరిగేలా అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా అధికారులు చొరవ చూపుతున్నారు.
పాలిసెట్ ప్రశాంతం
జగిత్యాల: జిల్లాలో పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,329 మంది హాజరయ్యారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షించారని పరీక్షల కో–ఆర్డినేటర్ అరిగెల అశోక్ తెలిపారు.


