రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేదిస్తోంది. 2018లో మేజర్ గ్రామపంచాయతీ నుంచి మూడో శ్రేణి మున్సిపాలిటీగా మారింది. ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ రాయికల్ బల్దియాలో మాత్రం ఉద్యోగులు, సిబ్బంది కొరతతో ఉన్న వారిపైనే పనిభారం తీవ్రతరం అవుతోంది. పారిశుద్ధ్యం లోపించడంతో పాటు, సమస్యలు పేరుకుపోవడం, ఆర్థికంగా వనరులు లేకపోవడంతో మున్సిపాలిటి అభివృద్ధి కుంటుపడుతోంది.
బల్దియాలో సిబ్బంది కొరత..
రాయికల్ బల్దియాలో టీపీబీవో, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులే మంజూరు కాలేదు. 12 వార్డులుండగా, కేవలం ముగ్గు రు వార్డు ఆఫీసర్లు మాత్రమే నియమించారు. 9 వార్డు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా టీపీబీవో సూర్యతేజను కోరుట్ల నుంచి వారానికి మూడు రోజుల చొప్పున రాయికల్‌కు డిప్యూటేషన్‌పై ఇటీవల నియమించారు. పారిశుద్ధ్య కార్మికులు 56 మంది ఉండాల్సి ఉండగా, కేవలం 23 మంది మాత్రమే అవుట్‌సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళలు, సిబ్బంది, వాహన డ్రైవర్లు ఉండటంతో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ సురేశ్‌ను నియమించినప్పటికీ డిప్యూటేషన్‌పై ఆర్మూర్‌కు తరలించారు.
ఉన్నవారిపైనే భారం..
బల్దియాలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైనే పనిభారం తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు పూర్తిస్థాయిలో నియామకం కాకపోవడంతో పాటు, ఉన్న కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతం రాయికల్ బల్దియా ఉంది. బల్దియాకు కేవలం పన్నుల రూపేన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. బల్దియాకు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో వచ్చే ఆదాయం లేక పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వడానికే అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు స్పందించి రాయికల్ బల్దియాలో ముఖ్యమైన పోస్టుల్లో అధికారులను నియమించి మరికొంత మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రాయికల్ పట్టణం
జనాభా : 20,500
వార్డులు : 12
నివాస గృహాలు : 6000
ఉన్న వారిపైనే పని భారం
కుంటుపడుతున్న అభివృద్ధి
ఖాళీగా 9 వార్డు ఆఫీసర్ పోస్టులు


