ఉన్నత లక్ష్యాలు చేరేందుకు శ్రమించాలి
జగిత్యాల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరేందుకు నిరంతరం శ్రమించాలని, పరిశుభ్రత సైతం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పీఎం పోషణ్ తనిఖీల్లో భాగంగా జగిత్యాలలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్లాన్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెస్ కమిటీ వ్యవహారాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
భోజనం బాగుంటుందా..
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులను ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటశాలను తనిఖీ చేసి భోజనం బాగుంటుందా, కూరలు ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. పీఎం పోషణ్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందుతున్న ఆహారం, వసతులపై తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో రాము, తహసీల్దార్ రాంమోహన్, కేజీబీవీ ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.


