బీ–ఫామ్ వస్తుందా..!?
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం.. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో బీ–ఫామ్ ఎవరికి వస్తుందోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. సమయం తక్కువగా ఉండడంతో చాలామంది ఆశావహులు తమ మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా జగిత్యాల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహుల్లో బీఫామ్ ఎవరికి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పార్టీ తరఫున అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీ–ఫామ్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేలా ఆలోచన చేస్తున్నప్పటికీ.. ఆయా పార్టీల నుంచి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే ప్రధాన పార్టీల నాయకులు గెలుపుగుర్రాలను బరిలో దింపాలని ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఎవరు వచ్చినా ముందుగా నామినేషన్ వేయాలని ఆదేశించారు. దీంతో ఒక్కోపార్టీ నుంచే దాదాపు ముగ్గురి నుంచి నలుగురు వరకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమకే టికెట్ వస్తుందంటే తమకేనని పైకి ధీమాగా చెబుతున్నా.. లోలోపల మాత్రం కంగారు పడుతున్నారు. మరోవైపు ఎలాంటి గుర్తు లేకుండానే ప్రచా రం మొదలుపెట్టారు. కొందరైతే ఎమ్మెల్యే మద్దతు తనకుందంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరికొందరు జీవన్‌రెడ్డి మద్దతు ఉందని, టికెట్లు గ్యారంటీగా వస్తాయని చెప్పుకుంటున్నారు. పార్టీ టికెట్ దక్కుతుందనే ధీమాతో కొందరు నామినేషన్లు దాఖలు చేయడంతో ముఖ్య నేతల ఆశీస్సులున్నాయని, వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు.
అందరి చూపు జగిత్యాలపైనే..
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం జగిత్యాలపైనే పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్‌లపైనే ఇబ్బందిగా మారింది. మాజీమంత్రి జీవన్‌రెడ్డి మొదటి నుంచి కార్యకర్తగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, తన వర్గానికే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ కాస్త గందరగోళం తయారైంది. ఎవరికి టికెట్ వస్తుందో..? ఎవరికి మొండిచేయి చూపుతారోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్‌ఎస్ కు చెందిన క్యాడర్ అంతా ఎమ్మెల్యే వైపు ఉన్న ట్లు కనిపిస్తున్నా.. పార్టీలో ఎవరూ చేరిన దాఖలు లేవు. మరోవైపు కాంగ్రెస్‌లో సభ్యత్వం లేని వారికి బీఫామ్‌లు ఎలా ఇస్తారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇరువర్గాల వారికి బీఫామ్‌లు రాకపోతే పరిస్థితి ఏంటని.. మరోదారి చూసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా..? లేదా ఏదైనా పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవాలా..? అని ఆలోచన చేస్తున్నారు.
ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్
నామినేషన్లు మాత్రం దాఖలు
నేటితో చివరి గడువు
అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు
ఎవరికి ఇవ్వాలో తెలియక సతమతం


