‘ఆయుష్’ సేవలకు మోక్షమెప్పుడో..?
శిక్షకుల ఏర్పాటుకు కసరత్తు
ధర్మపురి: కోట్లాది నిధులు వెచ్చించి నిర్మించిన ఆయుష్ కేంద్రాల సేవలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం కేంద్రప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 44 యోగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా మొదటి విడుత కరీంనగర్ జిల్లాకు 14, జగిత్యాలకు 12, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 8, పెద్దపల్లి జిల్లాకు 10 చొప్పున కేటాయించింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ.2.64 కోట్లను వెచ్చించింది. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, కోరుట్ల, మెట్‌పెల్లి, అబ్బాపూర్, బతికెపల్లి, వీవీరావుపేట, బండలింగాపూర్, ఎండపెల్లి, లక్ష్మీపూర్, కొడిమ్యాల, వెల్లుల, చిల్వకోడూర్ ఆరోగ్యకేంద్రాలకు అనుబందంగా ఆయుష్ వెల్‌నెస్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్డు నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున జగిత్యాల జిల్లాకు రూ.72 లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 12 షెడ్ల నిర్మాణం చేపట్టగా వాటిలో ధర్మపురి, మెట్‌పెల్లి, బతికెపల్లి, లక్ష్మీపూర్, ఎండపెల్లి, వీవీరావుపేటలో షెడ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఆరు చోట్ల పనులు నత్తనడకన సాగి ప్రస్తుతం పూర్తి దశకు చేరాయి. ప్రతి షెడ్డును ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆస్పత్రి వెనుక భాగంలో షెడ్ల నిర్మాణాలను ఏర్పాటు చేశారు.
అనుభవజ్ఞులైన వారిచే శిక్షణలు
యోగాలో మంచి ప్రావీణ్యం సంపాదించి అనుభవజ్ఞులై యోగా నుంచి సర్టిఫికెట్ పొందిన వారితో యోగా శిక్షణలు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో కేంద్రంలో ఒక మహిళ, ఒక పురుషుడిని శిక్షకులుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తోంది. వారికి నెలకు రూ.6వేల జీతం చొప్పున చెల్లించనున్నారు. ఆరోగ్య భారత్‌లో భాగంగా ప్రతిఒక్కరికి యోగా కేంద్రంలో శిక్షకులతో యోగాసనాలు నేర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా కేంద్రాలు సత్ఫలితాలిస్తే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం చేసిన మంచి ఆలోచన అని భావిస్తున్నారు. యోగాసనాలతో ఆరోగ్యంతోపాటు గర్భిణుల సుఖప్రసవాలకు ఈ ఆసనాలు ఉపయోగపడనున్నాయి.
శిక్షకులు లేక నిరుపయోగం
జిల్లాలో నిర్మించిన ఆయుష్ కేంద్రాల్లో శిక్షకులను నియమించక పోవడంతో కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రకృతి వైద్యంపై శిక్షణ, ఫిజియోథెరపీ వంటి వైద్య చికిత్స అందించాల్సి ఉన్నప్పటికీ ఏ కేంద్రాల్లోనూ శిక్షకులను నియమించలేదు. ఒక్కో కేంద్రానికి ఇద్దరు యోగా శిక్షకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామన్న అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడంతో షెడ్లకు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి.
ప్రజారోగ్యం కాపాడడమే లక్ష్యం. యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షకులను ఇంకా నియమించలేదు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అనుభవజ్ఞులైన లోకల్ శిక్షకులను నియమించే ఆలోచనలో ఉంది. త్వరలోనే కేంద్రాలను ప్రారంభిస్తాం.
– మహేందర్‌రెడ్డి, జిల్లా నోడల్ అధికారి
ఆస్పత్రులకు అనుబంధంగా ఏర్పాటు
శిక్షకులు లేక కేంద్రాలు నిరుపయోగం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాలు


