తోటగోపయ్యపల్లి వార్డు సభ్యుడి మృతి
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం తోటగోపయ్యపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు తోట కుమార్ శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. తోటగోపయ్యపల్లి ఇటీవలే గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. అందులో ఒకటో వార్డు సభ్యుడిగా కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుమార్ మృతికి సర్పంచ్ దొబ్బల రమేశ్, పాలకవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటం ఎదుట నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వార్డు సభ్యుడి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.
ప్రమాదవశాత్తు రైతు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ రైతు పొలం వద్దకు వెళ్లి ఒడ్డుపై నడుస్తుండగా.. కాలుజారి కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన పండుగ గంగయ్య (55) శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తన పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి పంటకు నీరుపడుతూ అక్కడే ఉండిపోయాడు. ఆదివారం ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లగా, గంగయ్య పొలంలో విగతజీవిగా పడి ఉండడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని జవహర్‌నగర్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోశిక సాత్విక్(23) ఆదివారం మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని కేసీఆర్ కాలనీకి చెందిన సాత్విక్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా గోదావరిఖనిలోని తన ఇంటికి వచ్చాడు. శనివారం స్థానిక ఎల్బీనగర్‌కు చెందిన కార్తికేయ అనే స్నేహితుడు అతడి బైక్‌పై సాత్విక్‌ను బయటకు తీసుకుపోయాడు. స్థానిక జవహర్‌నగర్‌లో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరూ ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన సాత్విక్‌ను కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన కార్తికేయను స్థానికంగానే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి పట్టివేత
కోరుట్ల: కోరుట్లలోని కల్లూర్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వంద గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. పి.మణిసాయి, కె.రోహిత్, బి.దీపక్, బి.మనోహర్ రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి పట్టుబడింది. గంజాయిని పట్టణంలో మరికొందరికి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారని ఎస్సై తెలిపారు. వారి నుంచి గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేశామని వివరించారు.
తోటగోపయ్యపల్లి వార్డు సభ్యుడి మృతి
తోటగోపయ్యపల్లి వార్డు సభ్యుడి మృతి


