మనవద్దా.. కన్నమేనా.!?
కరీంనగర్ అర్బన్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సొమ్మును దారి మళ్లించిన ఘటనల క్రమంలో జిల్లాపై దృష్టిసారించారు. జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగుచూడటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో జరిగిన స్టాంపు డ్యూటీ చెల్లింపులపై ప్రత్యేక దృష్టిసారించారు. అత్యధిక విలువ గల గంగాధర, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాలతో పాటు మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మండలాలతో పాటు తదితర మండలాల్లో జరిగిన స్టాంప్ డ్యూటీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఐదేళ్లుగా భూముల రిజిస్ట్రేషన్లపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. జీపీఏ రిజిస్ట్రేషన్లతో పాటు మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు సాంకేతికత ఆధారంగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
లావాదేవీలపై డేగకన్ను
మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు, పోర్టల్ ఆపరేటర్లు, సీసీఎల్‌ఎ సిబ్బంది పాత్రతోపాటు తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్లే ఆక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. ఇతర జిల్లాల్లో వెలుగుచూసిన ఘటనల్లో ఇదే తేటతెల్ౖలమైంది. గతంలో ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ కుంభకోణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రయ, విక్రయదారులతో సంబంధం లేని ఫోన్ నంబర్లతో స్లాట్లు బుక్ చేసి, ఆ స్లాట్ ఐడీల ఆధారంగానే దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌ను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించగా భూభారతి పోర్టల్‌ను ఎన్‌ఐసీకి అప్పగించారు. అప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90శాతం మంది వారే కావడం ఈ అక్రమాలు కొనసాగేందుకు ఊతమిచ్చిందన్న ఆరోపణలున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించేటప్పుడే చలాన్లను ఎడిట్ చేసే అవకాశముండగా సాంకేతిక పరిజ్ఞాన దుర్విని యోగమైంది. జాయింట్ సబ్జిస్ట్రార్ హోదాలో ఉండే తహసీల్దార్లకు కేవలం భూమి వివరాలు, క్రయ, విక్రయదారుల వ్యక్తిగత వివరాలు సరిచూసుకునే బాధ్యత తప్ప ప్రభుత్వానికి అందాల్సిన మొత్తాన్ని చెక్ చేసే వ్యవస్థ వారి వద్ద లేదని.. ధరణి పోర్టల్ నుంచే ఇది కొనసాగుతున్నప్పటికీ భూభారతి అమల్లోకి వచ్చినా కూడా దీన్ని మార్చలేదని తెలుస్తోంది. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఉద్యోగి చెక్ చేసి సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సదరు రిజిస్ట్రార్ ఆయా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీజు, చలాన్ అంశాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్‌కు పంపుతారు. కానీ వ్యవసాయ భూముల విషయంలో ఒకసారి స్లాట్ బుక్ అయిన డాక్యుమెంట్ నేరుగా తహసీల్దార్లకే వెళ్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ప్రింట్ తీశాకే చలాన్ ఎంత కట్టారన్నది రివర్స్ ఎండార్‌మెంట్లో కనిపిస్తోంది. వ్యవసాయ భూములను గత ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న పలువురు తహసీల్దార్లకు ఎంత భూమి రిజిస్ట్రేషను ఎంత ఫీజు కడతారో కూడా తెలియదని, ఆఫీసు సిబ్బందిపైనే ఆధారపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.
స్టాంపు డ్యూటీ చెల్లింపులపై సాగుతున్న విచారణ
భూముల రిజిస్ట్రేషన్‌పై నజర్


