ముందుకు సాగని ‘సూరమ్మ’ కాలువలు
కథలాపూర్: కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువ పనుల్లో కదలిక లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ఫేజ్–2 స్టేజీ–1 పనుల్లో భాగంగా ప్రాజెక్టు నిర్మించి కుడి, ఎడమ కాలువల ద్వారా మెట్టప్రాంతమైన కథలాపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. తాము అధికారంలోకొస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకొచ్చి సుమారు రెండేళ్లు అవుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం మత్తడి పనులు పూర్తికాగా.. కాలువల తూముల నిర్మాణం చేపడుతున్నారు. కాలువ పనుల్లో కదలిక లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాలువ పనులకు 2018లో భూమిపూజ
ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులకు 2018 జూన్ 22న అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రూ.204 కోట్లు మంజూరు చేస్తూ భూమిపూజ చేశారు. కానీ పనులు మాత్రం ముందుకుకదలలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, నాలుగు మండలాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా కాలువ పనులు ప్రారంభించకపోవడంతో పాలకుల తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
భూసేకరణకు రూ.45.50 కోట్లు మంజూరు
ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువ పనుల భూసేకరణకు ఇటీవల ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.45.50 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులను కలెక్టర్ ఖా తాలో జమ చేసింది. 10 నెలల క్రితం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామసభలు ని ర్వహించి అభిప్రాయాలు సేకరించారు. కేటాయించిన రూ.45.50 కోట్లు సరిపోవని, ఈ క్రమంలో పనులు ప్రారంభానికి ఇంకెన్నాళ్లు వేచి చూడాల్సి వస్తుందోనని రైతులు అంటున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


