ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
మెట్‌పల్లి: ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మాధురి వేధిస్తున్నారని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం జూనియర్ కళాశాల విద్యార్థినులు మంగళవారం రోడ్డెక్కారు. కళాశాల ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. తమను అకారణంగా తిట్టడమే కాకుండా కొడుతోందన్నారు. ఆమె వైఖరితో జూనియర్ లెక్చరర్లు వెళ్లిపోతున్నారని, తరగతులు సక్రమంగా జరగడం లేదన్నారు. వేధింపులతో మానసికంగా ఇబ్బంది పడుతున్నామని, తక్షణమే ఆమెను తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ఎంఈవో చంద్రశేఖర్, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, తహసీల్దార్ నీతా చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను కళాశాల నుంచి పంపిస్తేనే తాము ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థినుల తేల్చిచెప్పారు. చివరకు ఆ శాఖ జిల్లా అధికారి పూరచందర్ వచ్చి మాధురిని కళాశాల నుంచి పంపించేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆమైపె చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.


