‘మధ్యాహ్న భోజనం’ నిలిపివేతపై విచారణ
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేసిన ఘటనపై మంగళవారం తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, ఎంపీడీవో గణేశ్ విచారణ చేపట్టారు. నిర్వాహకురాలు నారే చిన్ను, హెచ్‌ఎం రాజేందర్, విద్యార్థులను వేర్వేరుగా వివరాలు అడి గి తెలసుకున్నారు. తాను 18ఏళ్లుగా వంట చేస్తున్నానని, హెచ్‌ఎం రాజేందర్ వచ్చాక ఇబ్బంది పెడుతున్నాడని చిన్ను తెలిపింది. మెనూ ప్రకారం వండడం లేదని, గతనెల 30న నీళ్లచారు, పప్పు పెట్టిందని హెచ్‌ఎం వివరించారు. చిన్ను రుచికరంగానే వంటలు చేస్తున్నారని, ఆర్థిక పరిస్థితి సరిగా లేక.. బిల్లులు రాక కొంత ఇబ్బంది పడుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. రుచికరంగానే వంట చేస్తోందని కొందరు విద్యార్థులు.. మెనూ ప్రకారం పెట్టడం లేదని మరికొందరు వివరించారు. వివరాలను డీఈవోకు నివేదిస్తామని అధికారులు తెలిపారు.


