
సేంద్రియ సాగుకు శ్రీకారం
● జిల్లావ్యాప్తంగా 2500 మంది రైతుల ఎంపిక ● ఒక్కో క్లస్టరు నుంచి 125 మంది ● మహిళలకు కృషి, సఖీలుగా నామకరణం
గోదావరిలో పుణ్య స్నానాలు
ధర్మపురి: శ్రావణం సందర్భంగా బుధవారం గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.
గొల్లపల్లి: వ్యవసాయంలో రైతులు పాత పద్ధతులను అలవర్చేందుకు కేంద్రం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా రైతులతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్) ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 20మండలాల్లో 2500 మంది రైతులను ఎంపిక చేశారు. అలాగే 2500ఎకరాలను సేంద్రియ వ్యవసాయం కోసం గుర్తించారు.
ప్రకృతి వ్యవసాయానికి చర్యలు
ఎన్‌ఎంఎన్‌ఎఫ్ కార్యక్రమం ద్వారా మండలానికి ఒక క్లస్టర్‌ను ఎంపిక చేసి వాటి పరిధిలో ఉన్న రైతులను గుర్తించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి చర్యలు చేపట్టారు. ఒక్కో క్లస్టర్‌కు 125 మందితో సేంద్రియ వ్యవసాయం చేయించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన క్లస్టర్ల పరిధిలో రైతులను గుర్తించి వారికి అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన రైతుల భూముల వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపించారు. నేలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. జీవవైవిధ్యం పెంచడానికి.. భూమి సహజవనరులను పరిరక్షించడానికి ఈ పథకం ద్వారా రైతులకు వివరించనున్నారు. ప్రకృతి, సేంద్రియ సేద్యం చేయిస్తూ.. సహజ పద్ధతిలో సాగు చేయించడానికి అధికారులు రైతులను సిద్ధం చేస్తున్నారు.
మహిళల ఎంపిక
సేంద్రియ వ్యవసాయం కోసం రైతులను గుర్తించగా.. ఎంపిక చేసిన క్లస్టర్లలో 125 మందిలో మహిళలనూ ఎంచుకున్నారు. ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 20 మంది మహిళల వివరాలు సేకరించారు. వీరు మహిళా సంఘాలతో అనుబంధంగా ఉండేలా చూస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు ‘కృషి, సఖి’గా నామకరణం చేశారు. వీరికి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి ఇద్దరు మహిళలు హాజరుకావాల్సి ఉంటుంది. వీరు వారివారి క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వీరికి గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మూడేళ్ల పాటు ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం కింద ఇన్‌పుట్ సబ్సిడీ అందించనున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే రెండు క్లస్టర్లలో 150 మందిని ఎంపిక చేశాం. భూసార పరీక్షలకు శాంపిళ్లు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.
– కరుణ, ఏవో, గొల్లపల్లి
సేంద్రియ వ్యవసాయం చేయాలి
సేంద్రియ వ్యవసాయంతో రసాయన మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పురుగుల మందులు అధికవాడకంతో క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంపిక చేసిన గ్రామాల రైతులే కాకుండా ఇతర రైతులూ సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలి.
– భాస్కర్, డీఏవో

సేంద్రియ సాగుకు శ్రీకారం

సేంద్రియ సాగుకు శ్రీకారం

సేంద్రియ సాగుకు శ్రీకారం