జగిత్యాల: ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. పెండింగ్ దరఖాస్తులన్నిటికీ ఈనెల చివరి వరకు పరిష్కారం చూపాలన్నారు. అదనపు కలెక్టర్ లత, తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఒత్తిడికి లోనుకావద్దన్నారు. 99.95 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఈవో రాము, తదితరులు ఉన్నారు.
క్షయ రహిత జిల్లాగా మార్చుదాం
జగిత్యాల: జిల్లాను క్షయ రహితంగా మార్చడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఐఎంఏ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 16 గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా గుర్తించామని, ఎక్కడైనా వ్యాధికి సంబంధించి దగ్గు, తెమడ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, జయపాల్‌రెడ్డి, అర్చన తదితరులు పాల్గొన్నారు.