సమాచారం దాచి.. సంక్షోభం పెంచి

World countries are worried about China Covid death toll - Sakshi

బీజింగ్‌: తొలిసారిగా వూహాన్‌లో కరోనా వైరస్‌ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్‌ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్‌ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్‌ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి.

దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్‌ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్‌ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్‌ ఎపిడమిక్‌ కమాండ్‌ సెంటర్‌ అధినేత వాంగ్‌ పీ షెంగ్‌ అన్నారు.

అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం
ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథోనోమ్‌ ఘెబ్రియేసెస్‌ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్‌ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్‌ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ మైల్స్‌ యూ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top