‘‘ఏలియన్స్‌ నన్ను 50 సార్లు కిడ్నాప్‌ చేశారు’’

Woman Claims That She Abducted by Aliens 50 Times and Can Prove This - Sakshi

మహిళ సంచలన ఆరోపణలు

నిజం చెప్తున్నాను.. నిరూపిస్తాను

వాషింగ్టన్‌: ఈ సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని.. అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్‌ఓలను చూశామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఓ మహిళ ఏకంగా ఏలియన్స్‌ తనను ఇప్పటి వరకు 52 సార్లు కిడ్నాప్‌ చేశాయని.. వాటి సాంకేతికతను తనకు చూపించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సదరు మహిళ వ్యాఖ్యలు మరోసారి గ్రహాంతర జీవుల ఉనికిపై ఆసక్తి రేకేత్తించాయి.

ఆ వివారలు.. పౌలా అనే మహిళ బాల్యం నుంచి ఇప్పటి వరకు దాదాపు 52 సార్లు ఏలియన్స్‌ తనను కిడ్నాప్‌ చేశాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘బాల్యం నుంచి ఇప్పటి వరకు 52 అసాధారణ అనుభవాలను ఎదుర్కొన్నాను. వాటి గురించి ఎలాంటి హెచ్చరిక లేదు.. కనీసం ముందస్తు సూచన కూడా లేదు. అలా జరిగిపోయాయి. సాధరణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అవి కూడా అలానే జరిగాయి’’ అన్నారు పౌలా. 

1982లో తొలిసారి కిడ్నాప్‌...
‘‘నా జీవితంలో మొదటిసారి 1982 తొలిసారి స్పేస్‌షిప్‌ను చూశాను. కొన్ని క్షణాల తర్వాత నేను దాని లోపల ఉన్నాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. స్పేస్‌షిప్‌ లోపలంతా సైలెంట్‌గా ఉంది. నా హార్ట్‌బీట్‌ నాకే వినిపించేంత నిశ్శబ్దంగా ఉందక్కడ. కళ్లునులుముకుని చూసినా ఏం కనిపించడం లేదక్కడ. ఇంతలో ఓ వింత ఆకారం నా కళ్ల ముందుకు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు పౌలా.

‘‘దానికి మూడు చేతులున్నాయి. ప్రతి చేతి చివర్లో ఓ లైట్‌ ఉంది. మొత్తం మూడు లైట్లలో ఒకటి ఆకుపచ్చ, మరోకటి నీలం.. ఇంకో రంగు నాకు గుర్తు లేదు.  నేను ఉన్న స్పేస్‌షిప్‌ విమానం ప్రొపెల్లర్ బ్లేడ్‌లాగా ఉంది. ఇది సుమారు 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో.. నల్లగా ఉంది. దాని చివర్లలో నీలం, ఆకుపచ్చ రంగులు కనిపిస్తున్నాయి. ఆ స్పేస్‌షిప్‌ నిశ్శబ్దంగా.. క్లాక్‌వైజ్‌గా తిరుగుంది’’ అంటూ వర్ణించారు పౌలా.

ఆ ఫోటోలు మనిషి అత్యాశకు నిదర్శనం..
‘‘ఆ వింత ఆకారాలను చూసి నేను భయపడ్డాను. పారిపోవాలని ప్రయత్నించాను. కానీ అదేంటో అక్కడ నాకు పట్టు దొరకడం లేదు. ఇసుకలాగా జారిపోతున్నట్లు అనిపించసాగింది. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. ఇక ఆ ఏలియన్స్‌ నాకు తమ సాంకేతికతను చూపించసాగాయి. స్లైడ్‌షో ద్వారా తొలుత అందమైన చిత్రాలను చూపించాయి. వాటిలో నిర్మలమైన నది, నీలాకాశం కనిపించాయి. ఆ తర్వాత వచ్చిన ఫోటోల్లో నల్లగా మారిపోయిన నది.. ఎర్రగా మారిన ఆకాశం గోచరించాయి. మనిషి దురాశ వల్ల భూమి ఇలా మారిపోతుందని నేను గ్రహించగలిగాను. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. నాకు మెలకువ వచ్చేది’’ అని తెలిపారు పౌలా.

‘‘నా బాల్యం నుంచి నాకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఏలియన్స్‌ నా బెడ్‌రూమ్‌ కిటికి గుండా నన్ను తమతో పాటు తీసుకెళ్లేవి. ఈ సంఘటన జరిగిన ప్రతిసారి నేను నాలుగు గంటల పాటు కనిపించకుండా పోయేదాన్ని. నా తల్లిదండ్రులు నా కోసం గాలించేవారు. ఆ తర్వాత నేను బెడ్రూంలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయేవారు’’ అంటూ చెప్పుకొచ్చారు పౌలా.

తాను చూసిన ఏలియన్స్‌ ఎలా ఉంటాయో ఊహాచిత్రం గీయించారు పౌలా. ఇక ఏలియన్స్‌ తనను కిడ్నాప్‌ చేసిన సమయంలో అయిన గాయాలను కూడా చూపించారు పౌలా. కొందరు ఈమె మాటలను కొటి​ పారేస్తుండగా చాలా మంది మాత్రం నిజమే కాబోలు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: 
ఏలియ‌న్స్ నిజంగానే ఉన్నారా?
మార్స్‌పై ఏలియన్స్‌?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top