చైనాలో కరోనా మూలాలు అక్కడి నుంచే..!

Wildlife Farms In Southern China Likely Source Of Covid Pandemic - Sakshi

వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచే కరోనా వైరస్‌

డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడి అంచనా

త్వరలో అధికారిక నివేదిక 

జెనీవా : చైనాలో వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి కరోనా వైరస్‌ సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన సభ్యుడు పీటర్‌ డస్‌జాక్‌ అభిప్రాయపడ్డారు. వూహాన్‌లోని ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ వచ్చే అవకాశాల్లేవని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్‌–19 ఎలా పుట్టిందో తెలుసుకోవడం కోసం చైనాలో పర్యటించిన డబ్ల్యూహెచ్‌ఒ బృందంలో పీటర్‌ కూడా ఉన్నారు. దక్షిణ చైనాలో వన్యప్రాణుల్ని పెంపకం కేంద్రాల నుంచి వూహాన్‌లోని సీఫుడ్‌ మార్కెట్‌కి తరలిస్తూ ఉంటారని, దీనికి సంబంధించి తమ పర్యటనలో ఆధారాలు లభించాయని పీటర్‌ తెలిపారు. అమెరికన్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్‌ పలు విషయాలు చెప్పుకొచ్చారు.

వూహాన్‌ మార్కెట్‌లోనే కరోనా వైరస్‌ తొలిసారిగా బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పంపిన జంతువుల ద్వారా కరోనా వైరస్‌ మనుషుల్లోకి వచ్చి ఉంటుందనే అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి వన్యప్రాణుల సంరక్షణని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వన్యప్రాణుల్ని పెంచి పోషించేవారు ఎక్కువగా పాంగోలిన్స్, పార్క్‌పైన్స్, పునుగు పిల్లులు, రాకూన్‌ శునకాలు, బాంబూ ఎలుకలు పెంచుతూ ఉంటారు. ఆ కేంద్రాల నుంచే వైరస్‌ వచ్చి ఉంటుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ త్వరలోనే పూర్తి స్థాయి అధికారిక నివేదిక విడుదల చేయనుంది.

గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ప్రభుత్వం ఈ వన్యప్రాణుల పెంపకం కేంద్రాలన్నింటినీ మూసివేయడంతో పాటు, అక్కడ జంతువుల్ని ఎలా చంపాలో, పూడ్చి పెట్టాలో వివరిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇవన్నీ చూస్తుంటే కరోనా వైరస్‌ వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పుట్టి ఉండవచ్చునని డబ్ల్యూహెచ్‌ఒ బృందంలోని సభ్యులు అభిప్రాయపడుతున్నారని పీటర్‌ వివరించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top