చైనా ఇచ్చినవి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారా? | Why Chinese Items Were Banned After Trump Beijing Visit Explained Inside, Read Full Story | Sakshi
Sakshi News home page

చైనా ఇచ్చినవి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారా?

May 16 2026 8:31 AM | Updated on May 16 2026 10:24 AM

Why Chinese items were binned after Trump Beijing visit explained

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బీజింగ్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో స్నేహపూర్వకంగా మెలిగిన ట్రంప్‌.. మూడురోజులపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ఒప్పందాల మొదలు తైవాన్‌, ఇరాన్‌ యుద్ధం-హర్ముజ్‌ జలసంధి లాంటి సంక్లిష్టమైన అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అయితే.. పర్యటన ముగింపు వేళ జరిగిన ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ట్రంప్‌ పర్యటన ముగిసి.. మొత్తం బృందం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కే సమయంలో భద్రతా సిబ్బంది నుంచి మైక్‌ ద్వారా ఓ ఆదేశం వచ్చింది. అందులో.. Nothing from China allowed on the plane అని చెప్పారు. అంటే చైనా నుంచి ఏ వస్తువును తాము విమానంలోకి అనుమతించబోమని. అలా సిబ్బంది వాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వాటిని సేకరించి అక్కడే ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో పడేశారు. 

అలా పడేసిన వాటిల్లో.. ప్రెస్‌ పాస్‌లు, వైట్‌హౌస్‌ సిబ్బందికి ఇచ్చిన బర్నర్‌ ఫోన్లు, ప్రతినిధుల గుర్తింపు పిన్లు ఉన్నాయట. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ పూల్‌ ధృవీకరించింది.‘‘చైనా అధికారులు ఇచ్చిన ప్రతిదాన్ని అమెరికా సిబ్బంది సేకరించి, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే ముందు చెత్తబుట్టలో వేసేశారు. చైనాలో ఇచ్చిన ఏ వస్తువూ విమానంలోకి రాకూడదని ఆ సమయంలో వాళ్లు స్పష్టం చేశారు’’ అని న్యూయార్క్‌ పోస్ట్‌ వైట్‌హౌజ్‌ ప్రతినిధి ఎమిలీ గూడిన్‌ తెలిపారు. అయితే ట్రంప్‌నకు చైనా నుంచి ఏమైనా కానుకలు వచ్చాయా? వస్తే వాటిని అనుమతించారా? లేదంటే చెత్త బుట్టలోనే పడేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

అమెరికా అధ్యక్షుల విషయంలోనే కాదు.. రష్యా, ఫ్రాన్స్‌, నార్త్‌ కొరియా ఇలా చాలా దేశాల అధినేతల విషయంలో సిబ్బంది కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనల్లో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను(ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గుర్తింపు వస్తువులు) వాడకూడదనే నియమాలు ఉంటాయి. ఒకవేళ వాడినా.. క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే అనుమతిస్తారు. అలాగే కానుకల విషయంలోనూ అంతే. పరిస్థితిని బట్టి వాటిని అనుమతించకపోవడం ఉంటుందేమోగానీ.. మునుపెన్నడూ లేని రీతిలో చైనా పర్యటనలో అమెరికా అధ్యక్ష భద్రతా సిబ్బంది చెత్త బుట్టలో పడేయడం గమనార్హం. 

ట్రంప్‌ చైనా పర్యటనలో జరిగింది.. ఇంతదాకా ఏ అధినేత విషయంలో జరగలేదు. బహుశా  చైనా ఇచ్చిన వస్తువులతో సర్వైలెన్స్‌ లేదంటే స్పైవేర్‌ ప్రమాదం ఉండొచ్చని అమెరికా భద్రతా బృందం భావించి ఉండొచ్చు. అమెరికా–చైనా సంబంధాల్లో ఉన్న అనుమానాలు, గూఢచర్య భయాలు కారణంగా తీసుకున్న నిర్ణయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మారని ఆంక్షలు..
ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షుల సమావేశాలు స్నేహపూర్వకంగా కనిపించినా.. భద్రతా, ప్రెస్‌ బృందాల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి. టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ వద్ద ట్రంప్‌–షీ సమావేశం సమయంలోనే సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌కి ఆయుధం కారణంగా ప్రవేశం నిరాకరించడం చర్చనీయాంశమైంది. అలాగే అధ్యక్షుడు వెంట ప్రెస్‌ పూల్‌కి మోటర్‌కేడులోకి చైనా సిబ్బంది అనుమతించలేదు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అమెరికా సిబ్బంది ఒత్తిడి చేసి వారిని లోపలికి తీసుకెళ్లారు. 2016 అప్పటి అధ్యక్షుడు ఒబామా పర్యటన (హాంగ్‌జౌ, G20 సదస్సు సందర్భంగా)లో అమెరికా–చైనా సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగాయి. “ఇది మా దేశం, మా విమానాశ్రయం” అంటూ ఓ చైనా అధికారి చెప్పిన మాట.. ఆ సమయంలో చాలా పాపులర్‌ అయ్యింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement