
వాషింగ్టన్: గ్వాంటనామో బేలోని వలసదారుల నిర్బంధ కేంద్రానికి చేరుకున్న వెనిజులా వలసదారుల పర్యవేక్షణా బాధ్యతలను సాధారణ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి బదులు సైనిక అధికారులు చూస్తున్నారు. వలసదారులు ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీలో ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వలసదారులను సైనిక బలగాలు, వైద్యుల బృందాలు చూసుకుంటున్నాయని తాజాగా న్యూయార్క్‌టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గ్వాంటనామోలో వలసదారుల నిర్బంధ కేంద్రాలను విస్తరించే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించిన తరువాత ఇటీవల కొందరు వలసదారులను గ్వాంటనామోకు పంపిన విషయం తెల్సిందే.
గ్వాంటనామోలో ఉంచిన వలసదారులకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల్లో వారి జాతీయత మినహా మరే సమాచారం లేదు. ఆరో నంబర్ వలసదారుల శిబిరంలో 53 మంది పురుషులను ఉంచారు. గతంలో ఈ శిబిరంలో అల్‌ఖైదా అనుమానిత ఉగ్రవాదులను నిర్బంధించారు. ఈ శిబిరంలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సౌకర్యాలులేని శిబిరంలో వలసదారులను ఉంచారని, తాజా ఆహారం అందించకుండా ప్యాక్‌చేసి తీసుకొచ్చిన సైనిక ఆహారాన్నే వలసదారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టవిరుద్ధంగా రావడమే నేరం: ట్రిసియా
దాదాపు 100 మందిని గ్వాంటనామో కేంద్రానికి తీసుకొచ్చాం. వీరందరికీ బహిష్కరణ ఉత్తర్వులు అందాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ నేరానికి పాల్పడ్డారు. వీరిలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన ముఠా సభ్యులు, అక్రమ విదేశీయులు ఉన్నారు’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్ లాఫ్లిన్ చెప్పారు. అయితే, బందీలందరూ చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించలేదని, కొందరు శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం కల్పించాలని కోరగా వారి అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించి వారిని కూడా అరెస్ట్‌చేసిందని వార్తలొచ్చాయి.