హైదరాబాద్‌లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే | US Senator Eric Schmitt criticised Hyderabad Chilkur Balaji Temple | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే

May 15 2026 4:03 PM | Updated on May 15 2026 4:33 PM

US Senator Eric Schmitt criticised Hyderabad Chilkur Balaji Temple

వాషింగ్టన్‌: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం  ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే  చిలుకూరు బాలాజీని వీసా గాడ్‌ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  

హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో హెచ్‌-1బీ వీసా పోగ్రామ్‌ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్‌ కంపెనీలు హెచ్‌-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. 

అమెరికా సెనేటర్‌ నోట చిలుకూరు బాలాజీ 
ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్‌-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్‌-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్‌లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.

పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకు
అమెరికా వీసా ప్రోగ్రామ్‌లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్‌-1బీ,ఎల్‌-1,ఎఫ్‌-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్‌లో ఏఐపై బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. 

ఎల్‌‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు.  

అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్‌ ట్యాక్స్‌, వేజ్‌ రూల్స్‌ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‌‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్‌ కార్డ్‌లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. 

వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్‌ చేస్తారు
కార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్‌ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్‌వర్క్‌లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్‌ వర్క్‌ ఫోర్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావన
అమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్‌లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్‌గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్‌ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 

11 లేదంటే 108 ప్రదక్షిణలు
చిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement