అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. దీంతో హర్మూజ్‌లో చమురు రవాణా ఊపందుకుంది. 60 రోజుల చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎలక్ట్రానిక్ విధానంలో యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై తనకు మొదట భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఇరాన్ హక్కులు మరియు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రయోజనాలను కాపాడుతామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్లు ఖమేనీ పేర్కొన్నారు.
ఓ పక్క అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు అమల్లోకి వస్తుండగా.. ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్‌పై సైనిక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో ముగ్గురు హెజ్బోల్లా సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిని పక్కన పెడితే హెజ్బోల్లా నేత నైమ్ ఖాస్సెమ్ అమెరికా–ఇరాన్ ఒప్పందాన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణించారు.


