డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ స్పష్టీకరణ
చైనాలో ముగిసిన అమెరికా అధ్యక్షుడి పర్యటన
బీజింగ్: చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. స్వదేశానికి పయనమయ్యారు. ఆయన గురువారం, శుక్రవారం చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. తమ చర్చలను చరిత్రాత్మకమైనవి, మైలురాయిగా ఇద్దరు నేతలు అభివర్ణించారు. ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్య ఘర్షణలతో సహా పలు అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు.
రాజధాని బీజింగ్‌లో చైనా అధినేతలు నివసించే, అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన జోంగ్నాన్‌హయ్‌లో చివరిరోజు ట్రంప్, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. తమ చర్చలను ముగించారు. వారిద్దరూ ఆ ప్రాంగణంలో నడుస్తూ, మాట్లాడుకుంటూ, మధ్యమధ్యలో ఆగి తోటలోని చెట్లను, పువ్వులను చూస్తూ ముందుకు కదిలారు. చైనా పర్యటన విజయవంతమైందని ట్రంప్ ఉద్ఘాటించారు.
ఇది మరపురాని పర్యటన అని అభివరి్ణంచారు. అనేక విషయాలపై చైనాతో అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఇరుదేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అనేక సమస్యలను పరిష్కరించుకున్నాయని వెల్లడించారు. ఇది రెండు దేశాలకు, ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు. అయితే, ఆ ఒప్పందాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. జిన్‌పింగ్ తన పాత స్నేహితుడేనని, ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని, తమ మధ్య ఒక మంచి సంబంధాలున్నాయని ట్రంప్ స్పష్టంచేశారు. అమెరికా–చైనా సంబంధం చాలా ముఖ్యమైందని, అది మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
ఉమ్మడి అవగాహనకు వచ్చాం
ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమని జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాన్ని నిర్మించుకోవడానికి ఇరుపక్షాలు ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయని వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను స్థిరంగా ఉంచడం, వివిధ రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించడం, వివాదాలను సముచిత రీతిలో పరిష్కరించుకోవడం, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సంప్రదింపులు, సమన్వయాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఉమ్మడి అవగాహనకు చేరుకున్నామని స్పష్టంచేశారు.
బోయింగ్ నుంచి చైనాకు 200 విమానాలు!
అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి చైనా రాబోయే పదేళ్లలో 200 విమానాలు కొనుగోలు చేయనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన స్వదేశానికి తిరిగివెళ్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. బోయింగ్ నుంచి విమానాల కొనుగోలుకు చైనా అంగీకరించిందని, జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో 750 విమానాలను చైనా కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా కంపెనీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించే ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు.
పాకిస్తాన్‌కు మేలు చేయడానికే..
పాకిస్తాన్‌కు మేలు చేసే ఉద్దేశంతో ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై ఇక ఎలాంటి బాంబు దాడులు జరగవని స్పష్టం చేశారు. మరో దేశం(పాక్) చేసిన అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని చెప్పారు. పాకిస్తాన్‌కు సహాయం చేయాలనే ఉద్దేశంతో అలా చేశామని అన్నారు.
త్వరలో అమెరికాకు జిన్‌పింగ్
షీ జిన్‌పింగ్ మరో ఐదారు నెలల్లో అమెరికాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. సమావేశాలు, ఫోన్‌కాల్స్, లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి వారిద్దరూ అంగీకరించారని తెలిపారు.


