చైనాకు షాకిచ్చిన అమెరికా! | US Imposes Sanctions China-based refinery-40 Firms Over Iran oil Trade | Sakshi
Sakshi News home page

చైనాకు షాకిచ్చిన అమెరికా!

Apr 25 2026 4:46 AM | Updated on Apr 25 2026 5:02 AM

US Imposes Sanctions China-based refinery-40 Firms Over Iran oil Trade

ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాల‌పై ఆంక్ష‌లు విధిస్తాన‌ని ట్రంప్ హెచ్చ‌రిక‌లు చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే అమెరికా ఆచ‌ర‌ణ‌లోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్ర‌భుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీ స‌హా ఇరాన్ చ‌మురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థ‌లు, ట్యాంక‌ర్ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. 

ఇరాన్‌కు కీల‌క ఆదాయ వ‌నరుగా ఉన్న చ‌మురు ఎగుమతుల‌ను నిలిపేయ‌డానికి ట్రంప్ చేసిన ఎత్తుగ‌డ‌లో ఇదొక భాగ‌మ‌ని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్‌తో యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచ ఇంధ‌న స‌ర‌ఫ‌రాల‌కు కీల‌క‌మైన ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ జ‌ల‌మార్గ‌మైన హ‌ర్మూజ్‌జ‌ల‌సంధిని అమెరికా దిగ్భంధ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. 

కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చ‌మురును శుద్ధి చేసే సామ‌ర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వ‌తంత్ర రిఫైన‌రీల్లో ఒక‌టిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైన‌రీ ఇరాన్ నుంచి ముడి చ‌మురును స‌ర‌ఫ‌రా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వంద‌ల మిలియ‌న్ల డాల‌ర్ల ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్న‌ట్లు స‌మాచారం. 

ప్ర‌పంచ మార్కెట్ల‌కు చ‌మురును త‌ర‌లించడానికి ఇరాన్ ఆధార‌ప‌డే నౌక‌లు, మ‌ధ్య‌వ‌ర్తులు, కొనుగోలుదారుల నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తామ‌ని యూఎస్ ట్రెజ‌రీ సెక్ర‌ట‌రీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొద‌టివారంలో ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్‌, యూఏఈ, ఒమ‌న్‌లోని ఆర్థిక సంస్థ‌ల‌ను హెచ్చ‌రిస్తూ ఆంక్ష‌లు విధిస్తామ‌ని లేఖ‌లు పంపించింది. 

కాగా మ‌రికొన్ని వారాల్లో చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలోనే చైనాకు చెందిన కీల‌క రిఫైన‌రీపై ఆంక్ష‌లు విధించ‌డం ఎలాంటి చ‌ర్చ‌కు దారి తీస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement