దాడులతో దద్దరిల్లిన కాబూల్‌

US drone strike destroys Islamic State car bomb in Kabul - Sakshi

విమానాశ్రయం సమీపంలో నివాస ప్రాంతంపై రాకెట్‌ దాడి

చిన్నారి సహా ఆరుగురు మృతి

మరో ఆత్మాహుతి దాడిని భగ్నం చేసిన అమెరికా

ఆత్మాహుతి బాంబర్ల వాహనంపై డ్రోన్‌ దాడి

కాబూల్, వాషింగ్టన్‌: కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు ఆదివారం వేర్వేరు దాడులతో దద్దరిల్లాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో 24–36 గంటల మధ్య దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. విమానాశ్రయానికి సమీపంలోని ఖజే భాగ్రా ప్రాంతంలో ఒక నివాస ప్రాంతంపై ఐసిస్‌–కెకి చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు జరిపిన రాకెట్‌ దాడిలో ఒక చిన్నారి సహా ఆరుగురు మరణించినట్టుగా అఫ్గానిస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించి బయటకి వచ్చిన వీడియోలో నివాస ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్న దృశ్యాలే కనిపించాయి. విమానాశ్రయానికి ఒక కిలోమీటర్‌ దూరం వరకు ఈ పొగలు వ్యాపించాయి. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు.  

అమెరికా మిలటరీ మరో డ్రోన్‌ దాడి  
అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌–కె ఉగ్రవాదులు తలపెట్టిన ఆత్మాహుతి దాడిని అమెరికా భగ్నం చేసింది. విమానాశ్రయం వైపు ఆత్మాహుతి బాంబర్లతో దూసుకొస్తున్న ఒక వాహనంపై అమెరికా డ్రోన్‌తో దాడి జరిపింది. ఆ వాహనంపై అమెరికాయే దాడి చేసిందని ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి బిల్‌ అర్బన్‌ ధ్రువీకరించారు. ముప్పు తప్పించామని ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని,  ఆత్మ రక్షణ కోసమే తాము ఈ దాడి చేశామని వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించామన్న నమ్మకం తమకు ఉందన్నారు.

తరలింపు ప్రక్రియ  పూర్తయ్యేలోగా ఎదురయ్యే ప్రమాదాలపై జాగ్రత్తగా ఉంటామని బిల్‌ చెప్పారు. అయితే ఈ దాడిలో సాధారణ పౌరులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న విషయాలపై ఇంకా సమాచారం లేదు. అంతకు ముందు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ కూడా ఆత్మాహుతి బాంబర్‌ ప్రయాణిస్తున్న వాహనంపై అమెరికా దాడి చేసిందని చెప్పారు. కాబూల్‌ విమానాశ్రయంపై జంట పేలుళ్లు జరిపి 13 మంది అమెరికా సైనికులు సహా దాదాపుగా 180 మంది ప్రాణాలను తీసిన ఐసిస్‌–కె ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడు బైడెన్‌ ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లో డ్రోన్‌ దాడి చేసి విమానాశ్రయం పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్ని మట్టుబెట్టారు. ఇప్పుడు జరిపిన రెండో దాడిలో ఎంతమంది హతమయ్యారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

బ్రిటన్‌ బలగాల తరలింపు పూర్తి
అఫ్గానిస్తాన్‌లో అయిదేళ్లుగా ఉన్న బ్రిటన్‌ బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. కాబూల్‌ నుంచి 2 వేల మందిని తీసుకొని ఏ400ఎం విమానం శనివారమే బ్రిటన్‌కు బయల్దేరి వెళ్లింది. దీంతో బ్రిటన్‌ తరలింపు ప్రక్రియ పూర్తయినట్టుగా బ్రిటన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. తాలిబన్ల నుంచే బ్రిటన్‌ బలగాలకు ముప్పు పొంచి ఉండడంతో ఆగమేఘాల మీద తరలింపు ప్రక్రియ పూర్తి చేశామని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు.   

తుది దశలో అమెరికా బలగాల తరలింపు  
అమెరికా బలగాల ఉపసంహరణ తుది దశకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గడువులోగా ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో తాలిబన్లు కాబూల్‌ విమానాశ్రయం చుట్టూ మోహరించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోగానే విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top