విమానంలో మంటలు.. 231 మంది ప్రయాణికులు!

United Airlines Flight Emergency Landing At Denver airport After Engine Failure - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ ఇంజిన్‌లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. విమానం నుంచి శకలాలు విరిగి నేలపైన పడ్డాయి. అయితే అప్రమత్తమైన పైలట్లు ఫ్లైట్‌ను సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. 

డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, 10మంది సిబ్బందితో హోనొలులు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రెండో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో మంటలు చెలరేగి శకలాలు విరిగిపడ్డాయి. బ్రూమ్‌ఫీల్డ్‌, కొలరాడోలోని పలు నివాస ప్రాంతాల్లో ఇంజిన్‌ కౌలింగ్‌, టర్ఫ్‌ ఫీల్డ్‌లోని భాగాలను అధికారులు గుర్తించారు. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరస్‌లా మారింది.

విమానంలో మంటల ఘటనపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పందించింది. విమాన సిబ్బంది చొరవతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ‘ డెన్వర్‌ విమానాశ్రయం నుంచి యూనైటెడ్‌ ఫ్లైట్‌ 328 విమానం టేకాప్‌ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.కారణాలు తెలుసుకునేందు ఎఫ్‌ఏఏ(FAA), ఎన్‌టీఎస్‌బీ(NTSB)తో విచారణ జరిపిస్తున్నాం’అని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్ ట్వీట్‌ చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top