వైరలవుతున్న బ్రిటన్‌ ప్రధాని దీపావళి సందేశం

UK PM Boris Johnson Diwali Message On Coronavirus Pandemic Became Viral  - Sakshi

లండన్‌ : బ్రిటన్‌ ప్రధాని బొరిస్‌ జాన్సన్ భారతీయ సంప్రదాయంలో పెద్ద వేడుకగా నిర్వహించుకునే దీపావళి పండుగపై ప్రశంసలు కురిపించారు.  భారతీయ ప్రజలు చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు.తాజాగా బ్రిటన్‌లో సెకెండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ విజృంబిస్తున్నవేళ డిసెంబర్‌ 2వరకు అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం లండన్‌లోని  10వ డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఐగ్లోబల్‌ దివాలి ఫెస్ట్‌ 2020 పేరుతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని బొరిస్‌ జాన్సన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. (చదవండి : దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!)

'ప్రస్తుతం కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ దేశంలో వేగంగా విస్తరిస్తుందని.. మనందరం మరోసారి అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐకమత్యంతో కరోనా వైరస్‌పై పోరాటం చేయల్సిన సమయం వచ్చింది. కాంతిని విరజిమ్ముతూ చీకట్లను పారద్రోలేలా.. చెడుపై మంచి విజయం సాధించినట్లుగా.. అజ్ఞానంపై జ్ఞానం ఆధిపత్యం చూపించిన విధంగా మనం పోరాడాల్సి ఉంటుంది. అచ్చం భారతీయులు జరుపుకునే దీపావళి పండుగ లాగే..  భారతీయ సంప్రదాయంలో రాముడు తన భార్య సీతతో కలిసి రావణుడిని ఓడించి తిరిగి భారతదేశానికి చేరుకున్న సమయంలో దేశ ప్రజలు కొన్ని కోట్ల దీపాల వెలిగించి తమ విజయాన్ని చూపించారు.

అదే విధంగా ఇప్పుడు కరోనా వైరస్‌పై యుద్దం చేయడానికి అదే పని మనం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మా ప్రభుత్వం పెట్టిన ఆంక్షల మేరకు బ్రిటన్‌లోని భారతీయ ప్రజలు పండుగలను జరుపుకోవడం అభినందనీయం.  రానున్న దీపావళి పండుగను కూడా ఇదే తరహాలో జరుపుకోవాలని ఆశిస్తున్నా. పండుగను వేడుకలా జరుపుకునే భారతీయులకు ఇది కొంచెం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. కాగా తాము ప్రారంభించిన దివాలి ఫెస్ట్‌కు బ్రిటన్‌లోని భారతీయులంతా ఇళ్లలోనే ఉండి వర్చువల్‌ వీడియో ద్వారా పాల్గొనాలని కోరుతున్నా. అందుకే ఐ గ్లోబల్‌ దివాలి ఫెస్ట్‌ 2020 పేరుతో జరగనున్న దివాలి వేడుకను ప్రారంభించాం'అంటూ చెప్పుకొచ్చారు.

కాగా వర్చువల్‌ మోడ్‌లో జరగనున్న దివాలి ఫెస్ట్‌ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల్లో భారతీయ సంప్రదాయాలైన యోగా, భారతీయ సంగీతం, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే కార్యక్రమంలో వర్చువల్‌ సెషన్‌ ద్వారా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు, బ్రిటీష్‌ ఇండియన్‌ మ్యుజిషియన్‌ నవీన్‌ కుంద్రా ఆధ్వర్యంలో పలు బాలీవుడ్‌ గీతాలు ఆలపించనున్నారు. కాగా దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రజలు నవంబర్‌ 14 న దీపావళి వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top