ఘోర విపత్తు.. బతుకులు శిథిలం.. 20 వేలమంది దాకా మృతి??

Turkey Syria Earthquake: WHO Estimate 20 Thousand Deaths - Sakshi

నాన్న.. లేరా: భూకంపం సృష్టించిన విలయంలో కళ్లెదుటే కన్నకూతురు శాశ్వతనిద్రలోకి జారుకుంది. శిథిలాల్లో ఆమె మృతదేహం చిక్కుకుపోయింది. ఆమె చేతిని పట్టుకుని అక్కడే స్థాణువై కూర్చుండిపోయాడా తండ్రి. టర్కీలోని ఖరామన్మరస్‌ ప్రాంతంలోనిదీ హృదయవిదారక దృశ్యం   

ఎటు చూసినా శిథిలాలే. వాటికింద చితికిన బతుకులే. కుప్పలుగా శవాలే. వరుస భూకంపాలు తుర్కియే, సిరియాల్లో అంతులేని విధ్వంసం సృష్టించాయి. వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. వాటికింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ చేస్తున్న ఆక్రందనలు కలచివేస్తున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 8 వేలకు చేరువైంది. శిథిలాలన్నింటినీ తొలగిస్తే అది మరింత భారీగా పెరిగేలా కన్పిస్తోంది.

తుర్కియే (టర్కీ), సిరియాల్లో సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేటమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 7,800 దాటింది. ఒక్క తుర్కియేలోనే దాదాపు 6,000 పై చిలుకు భవనాలు కూలిపోయినట్లు నిర్ధారించారు. విపరీతమైన చలి వణికిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాలను తొలగించడం, వాటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. సోమవారం మూడు భారీ భూకంపాలు ఇరు దేశాలను కుదిపేయడం తెలిసిందే. అనంతరం ఇప్పటిదాకా కనీసం 200కు పైగా చిన్నా పెద్దా ప్రకంపనలు వణికించాయి. వాటి భయానికి భారీగా జనం ఇళ్లూ వాకిలీ వీడి వలస బాట పడుతున్నారు. 

సహాయక చర్యలకు చలి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అధికార యంత్రాగంతో అంచనా వేయించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌.. పది ప్రావిన్స్‌లో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. 

ఇదిలా ఉంటే.. ఇది మహా విపత్తుగా అభివర్ణించింది ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్‌ఓ సెక్రటరీ జనరల్‌ థెడ్రోస్‌ అధోనం గెబ్రెయేసస్‌ స్పందిస్తూ.. టర్కీ, సిరియాలో రెండున్నర కోట్ల మంది.. భూకంపంతో ప్రభావితం అయ్యి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాల రీజియన్‌ను డిజాస్టర్‌ జోన్‌గా ప్రకటిస్తూ.. ఆయా దేశాలకు వీలైనంత సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇప్పటికే అత్యవసర వైద్య బృందాలను ఆ దేశాలకు పంపినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

తుర్కియే (టర్కీ), సిరియా భూకంపంలో గుండెపగిలే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరియాలోని అలెప్పో గ్రామీణ ప్రాంతంలో శిథిలాల మధ్య నెలలు నిండిన మహిళ ప్రసవించింది. కొత్తగా లోకాన్ని చూసిన ఆ పసిబాలుడ్ని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద తల్లిపేగు తెంచి  బాలుడి ప్రాణాన్ని కాపాడగలిగారు. కానీ కన్న తల్లికి మాత్రం అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. సహాయ సిబ్బంది ఒకరు ఆ పసిబాలుడ్ని బయటకు తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర­ల్‌గా మారింది. ఒక విపత్తుని ఎదిరించి పురుడు పోసుకున్న ఆ బాలుడు సిరియన్లకు ఆశాకిరణంగా మారాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

అంతటా ఆర్తనాదాలే 
శిథిలాల కింది నుంచి బాధితుల ఆక్రందనలు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయని భూకంపం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. ‘‘కానీ వారిని కాపాడుకొనే మార్గం కనిపించడం లేదు. కాంక్రీట్‌ స్లాబ్‌లను తొలగించే పరికరాలు మా దగ్గర లేవు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జాప్యం జరిగితే బాధితులు చనిపోయే ప్రమాదముందంటున్నారు. తుర్కియేలోని హతాయ్‌ ప్రావిన్స్‌లో వేలాది మంది క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్‌ హాళ్లలో తలదాచుకున్నారు. సైన్యం రంగంలోకి దిగి టెంట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. షాపింగ్‌ మాల్స్, స్టేడియాలు, మసీదులు, కమ్యూనిటీ సెంటర్లలోనూ నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు అందజేస్తున్నాయి. భూకంప కేంద్రమైన గాజియాన్‌టెప్‌ నగరంలో పరిస్థితి భీతావహంగా మారింది. ఎటు చూసినా బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. 

సహాయక చర్యలు పూర్తయితేనే స్పష్టత  
తుర్కియేలో ఇప్పటిదాకా 3,400 మందికి పైగా మరణించారని, 21,000 మందికి పైగా గాయపడ్డారని ఉపాధ్యక్షుడు ఫౌత్‌ ఒక్తాయ్‌ ప్రకటించారు. 10 ప్రావిన్స్‌ల్లో 7,800 మందిని రక్షించారు. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతంలో 800 మంది మృతిచెందారని, 1,400 మంది క్షతగాత్రులయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. తిరుగుబాటుదారుల ఆక్రమణలోని వాయవ్య ప్రాంతంలో 790 మంది మరణించారని, 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని సహాయక చర్యల్లో నిమగ్నమైన వైట్‌ హెల్మెట్స్‌ అనే వైద్య సంస్థ తెలిపింది. రెండు దేశాల్లోనూ మృతుల సంఖ్య భారీగా పెరగనుందని, సహాయక చర్యలు పూర్తయ్యాకే దీనిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. 

దేశాల ఆపన్న హస్తం 
తుర్కియే, సిరియాకు అండగా నిలిచేందుకు ఐక్యరాజ్యసమితితోపాలు పలు దేశాలు ముందుకొచ్చాయి. సహాయక సిబ్బంది, నిత్యావసరాలు, వైద్య సామగ్రి పంపుతున్నాయి. భారత్‌ ఎక్స్‌–రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కార్డియాక్‌ మానిటర్లను అందజేసింది. నిత్యావసరాలు, వైద్య పరికరాలతో రెండు విమానాలను పంపనుంది. ఇప్పటికే రెండు సైనిక రవాణా విమానాల్లో రెస్యూ్య టీమ్‌లను తుర్కియేకు పంపినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తుర్కియే అధ్యక్షుడు తయ్యీప్‌ ఎర్డోగాన్‌తో ఫోన్‌లో మాట్లా3డారు. భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ బుధవారం తుర్కియేలో పర్యటించనున్నారు. పలు దేశాల అంతరిక్ష సంస్థలు అందించిన భూకంపం, అనంతర పరిణామాల శాటిలైట్లు చిత్రాలు సహాయక చర్యల్లో ఉపయోగపడుతున్నాయి. 

సిరియా జైలు నుంచి 20 మంది ఉగ్రవాదుల పరారీ 
సిరియాలో భూకంపంలో ధ్వంసమైన జైలు నుంచి 20 మంది ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిలో చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. తుర్కియే సరిహద్దులో రాజో పట్టణంలోని ఈ మిలటరీ పోలీసు జైలులో 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్‌ ఉగ్రవాదులే. భూకంపంతో జైలు గోడలు, ద్వారాలు ధ్వంసమయ్యాయి. దాంతో 20 మంది సులభంగా తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.

అమ్మ ఎక్కడ..?  
ప్రకృతి ఉగ్రరూపానికి తల్లిడిల్లుతున్న తుర్కియే (టర్కీ) సిరియాల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేసిన ఘటనలు హృదయాన్ని కదిలిస్తున్నాయి. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని అనాథగా మారిన ఏడాదిన్నర బిడ్డ మా అమ్మ ఏది, ఎక్కడుంది ? అని అడుగుతూ ఉండడం అందరి హృదయాలన్ని పిండేస్తోంది. సిరియాలోని అజాజ్‌లో ఏడాదిన్నద వయసున్న ఒక పాప శిథిలాల కింద నుంచి మృత్యుంజయురాలై బయటకు వచ్చింది. గర్భిణిగా ఉన్న ఆమె తల్లి, సోదరుడు, సోదరి ఇలా కుటుంబమంతా శిథిలాల కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే, వెన్ను విరిగిపోయిన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇలా కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న చిన్నారుల్ని చూస్తుంటే అందరి గుండెలు పగిలిపోతున్నాయి. 

ఆస్పత్రుల్లో జీవచ్ఛవాలు  
తుర్కియే, సిరియాల్లోని ఆస్పత్రుల్లో ఒక వైపు శవాల గుట్టలు, మరోవైపు చావు బతుకుల మధ్య జీవచ్ఛవాలుగా మారిన వారితో నిండిపోయాయి. భూకంపం ధాటికి సర్వస్వం కోల్పోయిన వారు, కుటుంబాల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన పసివారి రోదనలతో హృదయవిదారకంగా మారింది. ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వైద్యం అందించడానికి బ్రిటన్‌ వైద్యుడు పరిస్థితుల్ని చూసి తల్లడిల్లిపోతున్నారు. వెంటిలేటర్లు సరిపడా లేకపోవడంతో ఒక రోగి నుంచి వెంటిలేటర్‌ తీసేసి మరో రోగికి అమరుస్తున్నారు. మరోవైపు, బతికే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వారికే వైద్యం చేస్తున్నామని, ఇలా చేయడం చాలా దుర్భరంగా అనిపిస్తోందని ఆ డాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు!.

గూడు వీడిన పక్షులు
తుర్కియేలో భూకంపం సంభవించడానికి ముందే పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లని వదిలి వెళ్లిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. పక్షులన్నీ రొద చేసుకుంటూ గుంపులుగా హడావుడిగా గూడి వదిలి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. సాధారణంగా భూకంపాన్ని పక్షులు, జంతువులు ముందే పసిగడతాయని అంటారు. ఈ వీడియోని పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహేంద్ర కూడా షేర్‌ చేశారు. ‘‘ప్రకృతి మనకు ఇచ్చిన హెచ్చరికల వ్యవస్థ. కానీ మనకే వాటిని అర్థం చేసుకోవడం తెలీడం లేదు’ అని కామెంట్‌ చేశారు. 2004లో సునామీకి ముందు కూడా ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. క్రీస్తుపూర్వం 373లో గ్రీస్‌లో భూకంపం సంభవించడానికి చాలా రోజుల ముందే ఎలుకలు, పాములు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన పోయిన విషయాన్ని ఈ సందర్భంగా అమెరికా జియోలాజికల్‌ సర్వే ఒక నివేదికలో గుర్తు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top