గ్రహాంతరవాసీ... నీవున్నావా? | Sakshi
Sakshi News home page

గ్రహాంతరవాసీ... నీవున్నావా?

Published Wed, Sep 27 2023 2:06 AM

Talk about aliens again with the appearance of two strange shapes - Sakshi

విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని  కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం.  

గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్‌ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్పీల్‌బర్గ్‌ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్‌ట్రా టెరె్రస్టియల్‌)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి.

అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్‌ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్‌ చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు.

అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. 

అమెరికాలోనూఇదే తంతు... 
యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ డేవిడ్‌గ్రుస్‌ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.

అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్‌ ఇంజనీరింగ్‌ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్‌ ర్యాన్‌గ్రేవ్స్‌ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్‌వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్‌ ప్రతినిధి సూగ్రౌఫ్‌ ప్రకటన విడుదల చేశారు. 

ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51
అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్‌ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది.

యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.

ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. 

అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... 
జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్‌ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్‌ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది.

అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్‌ సల్ఫైడ్‌ (డీఎంఎస్‌) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్‌ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. 

శుక్రుడిపైనా జాడలు... 
తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్‌లో ఉన్న కార్డిఫ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్‌ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్‌ బృందానికి చెందిన గ్రీవ్స్‌ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్‌ ఆ్రస్టానామికల్‌ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్‌ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది.

భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్‌ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్‌ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్‌ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్‌ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్‌ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. 

ఆధారాలను కనుగొనే దిశగా... 
గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు.

అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్‌ రోవర్‌ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్‌ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్‌ శాంపిల్‌ రిటర్న్‌ (ఎంఎస్‌ఆర్‌) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది.

విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... 
అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్‌ జరిగే అవకాశమూ ఉంది. 


-దొడ్డ శ్రీనివాసరెడ్డి  

Advertisement
Advertisement