
స్విట్జర్లాండ్/బెర్న్: అత్యాచారం.. ఓ బాలిక, యువతి, మహిళ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇలాంటి దారుణ నేరాల్లో న్యాయం జరగడం అటుంచి.. సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని చిత్రవధ చేస్తుంది. వారి పట్ల ఏమాత్రం జాలి, సానుభూతి చూపరు. పైగా నేరం చేసినవాడిని వదిలేసి.. బాధితురాలి ప్రవర్తననే తప్పు పడతారు. వీటన్నింటిని తట్టుకుని కోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. ఇక చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకున్నట్లు. సరిగా ఇలానే ప్రశ్నిస్తున్నారు స్విట్జర్లాండ్ వాసులు. అత్యాచారం వంటి దారుణమైన నేరానికి సంబంధించి మీరు ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. ఆ వివరాలు..
ఓ అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ తీర్పు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోస్తున్నారు.
కేసేంటంటే..
స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్‌ని జువైనల్ హోంకి తరలించింది.
వివాదాస్పద నిర్ణయం..
తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్‌సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. ఇక శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసింది.. పైగా అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయి’’ అన్నారు జస్టిస్ హెంజ్. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా నిరసన తెలపుతున్నారు జనాలు. ఈ సదర్భంగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్‌క్లబ్‌కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"Rape ONLY lasted for 11 minutes”
— daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021
11 minutes of rape feels like 16hrs and the effects/trauma last for generations. https://t.co/DRKgjTTqfA