గతంలో ‘న్యాయ’ వివాదాలు..!

As 4 Supreme Court Judges Revolt In Public, A Look At Standout Cases In Indian Judiciary - Sakshi

న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. పలువురు న్యాయమూర్తులు అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కోగా, ఓ మాజీ జడ్జీ కోర్టు ధిక్కార నేరం కింద ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు.

► 1993లో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామిపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది.
► 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్రా సేన్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు రాజ్యసభ గుర్తించింది. ఆయన్ను తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందే సేన్‌ తన పదవికి రాజీనామా చేశారు.
► కొలీజియంతో పాటు సుప్రీం, హైకోర్టు జడ్జీలపై పరువు నష్టం వ్యాఖ్యలు చేసినందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు 2016లో ఆరు నెలల జైలుశిక్ష పడింది. దీంతో జైలుశిక్ష ఎదుర్కొన్న తొలిజడ్జీగా కర్ణన్‌ నిలిచారు.  
► 2010లో వ్యక్తిగత ఆస్తుల్ని వెల్లడించడానికి సుప్రీం, హైకోర్టుల్లోని న్యాయమూర్తులు జంకుతున్న సమయంలో కర్ణాటక హైకోర్టు జడ్జీ జస్టిస్‌ శైలేంద్ర కుమార్‌ అప్పటి సీజేఐ జస్టిస్‌ బాలకృష్ణన్‌ను విమర్శించారు.
► 2012లో కర్ణాటక హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీ జ్ఞాన్‌ సుధా మిశ్రా ప్రకటించిన ఆస్తుల్లో తన పెళ్లికాని కుమార్తెలను అప్పుగా చూపించడంతో మరో వివాదం రాజుకుంది.
► 2012లోనే కర్ణాటక హైకోర్టులో విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ భక్తవత్సల.. గృహహింస ప్రతి ఇంట్లోనూ ఉంటుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
► గతేడాది ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై తన బ్లాగ్‌లో చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అత్యున్నత ధర్మాసనం మాజీ జడ్జి జస్టిస్‌ మార్కాండేయ కట్జూను ఆదేశించింది.
► 2015లో హార్దిక్‌ పటేల్‌ అరెస్ట్‌ కేసును విచారించిన గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా 58 మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన నోటీసును అప్పటి సభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి పంపారు.  
► సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ సదాశివం, న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గంగూలీలు తమ వద్ద శిక్షణ పొందుతున్న న్యాయ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు వచ్చాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top