శ్రీలంకలో ఇంధన మంటలు | Sri Lanka hikes fuel prices by 25percent amid West Asia conflict | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో ఇంధన మంటలు

Mar 23 2026 2:55 AM | Updated on Mar 23 2026 2:55 AM

Sri Lanka hikes fuel prices by 25percent amid West Asia conflict

25% మేర ధరలు పెంచిన ప్రభుత్వం

కొలంబో: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఇంధన ధరలను 25 శాతం మేర పెంచింది. ఈ పెంపు వా­రంలో రెండోసారి కాగా, మార్చి ఒకటో తేదీ తర్వాత మూడోసారి కావడం గమనార్హం. నూతన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, కనీసం 20 శాతం మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనాలున్నాయి. 

ఆటో డీజిల్‌ లీటరు ధర ప్రస్తుతమున్న రూ.303 నుంచి 26.1 శాతం మేర పెరిగి రూ.382కు చేరుకుంది. సూపర్‌ డీజిల్‌ రూ.353 నుంచి రూ.443కు, కిరోసిన్‌ రూ.195 నుంచి 30.8 శాతం మేర పెరిగి రూ.255కు, అదేవిధంగా, పెట్రోల్‌ 25.6 శాతం మేర పెరిగి రూ.398కి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశం 2022నాటి ఆర్థిక సంక్షోభాన్ని మరోసారి చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1948లో స్వాతంత్య్రం పొందాక మొట్ట మొదటిసారిగా శ్రీలంక అప్పులు చెల్లించలేని స్థితిలో సార్వభౌ­మ డిఫాల్టర్‌గా ప్రకటించారు. 

ఇంధన ధరలు పెరిగిన కారణంగా 90 శాతం మేర బస్సులను తిప్పే పరిస్థితులు లేవని ప్రైవేట్‌ బస్సు సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. ‘డీజిల్‌ ధర­ల్లో గతంలో ఎన్నడూ ఇంతభారీగా పెరగ­లేదు. ఇందుకు తగ్గట్లుగా కనీసం 15 శాత­మైన ఛార్జీలను పెంచకుండా బస్సులను నడపలేం’అని ప్రైవేట్‌ బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు విజయరత్నే చెప్పారు.  దేశంలోని బస్సు సర్వీసులను 65–75 శాతం మేర ప్రైవేట్‌ సంస్థలే నడుపుతున్నాయి. పెట్రోల్‌ ధర రూ.400 వరకు పెరిగితే ఆటోల్లో ఎవరు ప్రయాణిస్తారంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెంచిన ఇంధన ధరలతో పన్నుల రూ­పంలో ప్రభుత్వమే లాభపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

కాగా, ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం 5–8 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లీటరు పెట్రోలుపై రూ.100, డీజిల్‌పై రూ.20 వరకు సబ్సిడీ ఇస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతోందని ప్రభు­త్వం తెలిపింది. ఇంధన ధరలను పెంచకుంటే మరింత భారం మోయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు విద్యుత్‌ శక్తితో అవసరాలు తీర్చుకోవాలని, ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఇంధన రేషనింగ్‌ అమలు చేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ సాయంతో వారానికి బైక్‌లకు 5 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బస్సులకైతే 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే అందిస్తోంది.ఇంధన ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement