సముద్రంలో రేసింగ్ లెజెండ్ గల్లంతు | Speedboat Tragedy Missing Indian Rally star Hari Singh | Sakshi
Sakshi News home page

సముద్రంలో రేసింగ్ లెజెండ్ గల్లంతు

Mar 22 2026 10:29 AM | Updated on Mar 22 2026 10:29 AM

Speedboat Tragedy Missing Indian Rally star Hari Singh

మాల్దీవులు: భారత మోటార్ స్పోర్ట్స్ రంగంలో  విషాదం నెలకొంది. ఐదుసార్లు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచిన లెజెండరీ డ్రైవర్ హరిసింగ్ (59), మాల్దీవుల్లో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. గడచిన 48 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో, ఆయన మృతి చెంది ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?
శుక్రవారం ఉదయం వావు అటోల్‌లోని ఫెలిధూ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు చెందిన యాచ్‌తో అనుసంధానమై ఉన్న ఒక హై-స్పీడ్ బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో బోటులో హరిసింగ్, సింఘానియాతో పాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు గౌతమ్ సింఘానియాతో సహా ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. అయితే హరిసింగ్,  బోటు కెప్టెన్ మాత్రం సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయారు.

పగడపు దీవుల్లో చిక్కుకున్నారా?
మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) కోస్ట్ గార్డ్ బృందాలు మూడవ రోజు కూడా ముమ్మరంగా గాలిస్తున్నాయి. సముద్ర గర్భంలోని పగడపు దీవుల (Coral Reef) మధ్య హరిసింగ్ చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే హరిసింగ్ కుమారుడు మివాన్ సింగ్ మాల్దీవులకు చేరుకున్నారు.

భారత రేసింగ్ చరిత్రలో..
హరిసింగ్ కేవలం ఒక రేసర్ మాత్రమే కాదు.. భారత మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఒక మార్గదర్శిగా నిలిచారు.
1990లలో వరుసగా ఐదుసార్లు జాతీయ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక ఆసియా జోన్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయునిగా నిలిచారు. ప్రస్తుతం జేకే టైర్ మోటార్ స్పోర్ట్ హెడ్‌గా ఉంటూ, పలువురు యువ రేసర్లకు శిక్షణనిస్తున్నారు. హరిసింగ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
Advertisement