ఈ స్మార్ట్‌రింగ్‌తో కరోనాను ముందుగానే గుర్తించండి!

This Smart Ring Can Detect Corona Virus - Sakshi

కరోనా వైరస్‌ మన శరీరంలో  ఉందో లేదో నిర్ధారించుకునేందుకు  శాస్త్రవేత్తలు స్మార్ట్‌ రింగ్‌ను కొనుగొన్నారు. దాని పేరు ‘ఆరా రింగ్‌’. దీన్ని మన వేలికి పెట్టుకుంటే అది నిత్యం మన శరీర ఉష్ణోగ్రతను లెక్కగట్టి కరోనా గురించి అంచనా వేస్తుంది. లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాకూడా వైరస్‌ వచ్చే అవకాశాలను గుర్తించి చెప్పగలదు. 

50 మందిపై అధ్యయనం 
ఫిన్‌లాండ్‌కు చెందిన టెక్‌ స్టార్టప్‌ రూపొందించిన ఈ ఆరా రింగ్‌.. శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, శ్వాసరేటు తదితర అంశాలను నమోదుచేస్తుంది. ఈ రింగ్‌ పనితీరును అంచనావేసేందుకు 65వేల మందికి ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, ఎంఐటీ లింకన్‌ లాబ్‌ నిపుణులు ఈ రింగ్‌ ధరించిన 50 మందిపై అధ్యయనం చేశారు. అందులో నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి జ్వరం వచ్చే అవకాశాలను అంచనావేస్తుందని, దీన్నిబట్టి కరోనా వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించగలదని పరిశోధకులు చెప్పారు. అయితే, ఈ రింగ్‌ సామర్థ్యం గురించి పూర్తిస్థాయిలో కచ్చితమైన వివరాలు రావాలంటే మరి కొంత మందిని అధ్యయనం చేయాలని తెలిపారు. ఈ వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. 

స్వల్ప లక్షణాలను కూడా.. 
స్వల్ప జ్వరం లాంటి మనం గుర్తించలేని లక్షణాలను కూడా ఈ రింగ్‌ గుర్తించగలదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బెంజమిన్‌ స్మార్‌ చెప్పారు. మొత్తం 65వేల మంది వివరాలను అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది చివరినాటికి దీన్ని పూర్తిచేస్తామన్నారు. కరోనాను అంచనావేసే ఈ పరికరం ఎంతో దోహదం చేస్తుందని, దీనివల్ల ఆర్యోగ శాఖ అధికారులు వేగంగా స్పందించి వైరస్‌ను వీలైనంత త్వరగా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ‘ఈ రింగ్‌ వల్ల కోవిడ్‌–19ను త్వరగా గుర్తించవచ్చు. దీంతో ఆయా వ్యక్తులు వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లి ఇతరులకు వైరస్‌ వ్యాప్తించకుండా నిరోధించవచ్చు’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొఫెసర్‌ ఆష్లే మాసన్‌ చెప్పారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top