‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్‌ | Simla Agreement is Dead says Pakistan no its not says Again | Sakshi
Sakshi News home page

‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్‌

Jun 6 2025 7:37 PM | Updated on Jun 6 2025 9:28 PM

Simla Agreement is Dead says Pakistan no its not says Again

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఏ అంశంలోనూ తన తీరు మార్చుకోవడం లేదు. తన దుందుడుకు చర్యలతో ఉద్రిక్తతతలను రేకెత్తిస్తూనే ఉంది. నాటి సిమ్లా ఒప్పందం విషయంలోనూ ఒకసారి నోరు జారి, తిరిగి మాటమార్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 1972 సిమ్లా ఒప్పందాన్ని ‘చనిపోయిన పత్రం’ అని పేర్కొన్నారు. అయితే ఇది జరిగిన మర్నాడే ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ  స్పందిస్తూ, తాము భారతదేశంతో ఉన్న ఏ ద్వైపాక్షిక ఒప్పందాలను, రద్దు చేసే దిశగా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

తాజాగా జరిగిన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం ఏకపక్ష చర్యలు చేపడుతున్నదని, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో  ఆర్టికల్ 370 రద్దుతో పాటు సిమ్లా ఒప్పందాన్ని వాడుకలో లేకుండా చేసిందని విమర్శించారు. సిమ్లా ఒప్పందం విఫలమయ్యిందని, భవిష్యత్తులో ఇరు దేశాల వివాదాలను అంతర్జాతీయ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం  ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే మరుసటి రోజే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఆసిఫ్ వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి  ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందంతో సహా ఇరుదేశాల మధ్య అన్ని ఒప్పందాలు అమలులోనే ఉన్నాయని పేర్కొన్నారు.

నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ- పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య 1972, జూలై 2న సిమ్లా  శాంతి ఒప్పందం కుదిరింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది జరిగింది. ఫలితంగా భారత్‌ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే బంగ్లాదేశ్ ఏర్పడింది. కాగా ద్వైపాక్షిక చర్చల ద్వారా లేదా శాంతియుత మార్గాల ద్వారా  విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయనేది ఈ ఒప్పందంలోని ప్రధాన నిర్ణయం.

ఇది కూడా చదవండి: ‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌

Advertisement
 
Advertisement
Advertisement